వెల్డింగ్

వికీపీడియా నుండి
(వెల్డింగు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
షిల్డెడ్ మెటల్ ఆర్కు వెల్డింగు
GTAWగ్యాసు-టంగుస్టను ఆర్కువెల్డింగు (TIG) వెల్డింగు
గ్యాసు వెల్డింగు

వెల్డింగ్ (ఆంగ్లం: Welding) అనగా ఒకే రకమైన (సజాతి) లోహాలను, లేదా రెండు రకాల (విజాతి) లోహాల ఫలకాలను (plates), వస్తువులను ఒకదానితో నొకటి మేళనం చెందునట్లు కరగించి అతుకు ప్రక్రియ [1]. ఇది పురాతనమైన ప్రక్రియ. మానవుడు మృత్తిక నుండి లోహాల ముడి ఖనిజాన్ని గుర్తించి, వేరుచేసి అందుండి లోహాలను ఉత్పత్తి చేసి, వాటి నుండి తన అవసరానికి సరిపడ వస్తువులను తయారు చెయ్యడం ప్రారంభించిన తరువాత లోహాలను అతుకుటకు వెల్డింగ్ అవసరమైనది. లోహాల నుండి వస్తువులను మొదట ఫొర్జింగ్ (forging) పద్ధతిలో తయారు చేసేవారు. లోహాలను కరుగు స్థితి వచ్చు వరకు కొలిమిలో వేడి చేసి సుత్తెలతో లేదా సమ్మెటతో మోది తమకు కావలసిన ఆకారము వచ్చేటట్లు చేసేవారు. వెల్డింగ్ పద్ధతిలో లోహ భాగాలను జోడించడం తెలిసిన తరువాత వివిధరకాలలో పరిమాణంలో వస్తువులను తయారుచెయ్యడం సులభమైనది. మొదటలో ఫోర్జింగ్ విధానం లోనే అతుకవలసిన లోహ అంచులను ఎర్రగా అయ్యే వరకు కొలిమిలో వేడిచేసి రెండు అంచులను దగ్గరగా చేర్చి బలంగా సుత్తెలతో లేదా సమ్మెటలతో మోది రెండు అంచులు ఒకదానితో ఒకటి ఏకరూపతతో కలిసిపోయేలా చేసేవారు. ఇప్పటికీ కొన్ని గ్రామాలలో సంప్రదాయ కమ్మరి వారు ఎద్దుల బండ్ల చక్రాలకు వేసే ఇనుపపట్టిని వలయకారంగా వంచి రెండు అంచులను కొలిమిలో వేడిచేసి, సుత్తెలలో మోది అతకడం వాడుకలో ఉంది. ఇలాగే వ్యవసాయ పని ముట్టులను, పరికరాలను ఫొర్జింగ్ రీతిలో అతకడం చూడవచ్చును. ఆ తరువాత లోహ ఆభరణాలను, లోహ పాత్రలను మరింత తేలిక పద్ధతిలో అతకడం కనుగొన్నారు. ఈ పద్ధతిలో అంచులను కలుపుటకు రెండు భాగాలను అనుసంధానించుటకు ఒకలోహ పూరకాన్ని (filler), స్రావకాన్ని (flux) ఉపయోగించి అతకడం ప్రారంభమైనది. ఈ పద్ధతిలో లోహాలను అతకడం మరింత సులభతరమైనది. అవసరం అన్వేషణకు మూలము. రకరకములైన వెల్డింగ్ విధానాలను కాలక్రమాన ఆవిష్కరించడమైనది. ప్రస్తుతం దాదాపు 35 రకాలలో వెల్డింగ్ చేయు ప్రక్రియలు, వెల్డింగ్ యంత్ర పరికరాలు, పద్ధతులు వినిమయంలో ఉన్నాయి. వెల్దింగ్ యంత్రాలను, వాటి ఉపకరణాలను భారీస్థాయిలో తయారుచేయు పరిశ్రమలు ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నాయి.

చరిత్ర

[మార్చు]

వేల సంవత్సరముల క్రితమే మానవుడు ఫోర్జ్ వెల్డిండిం గు ద్వారా లోహాలను అతికేవాడని ఐరోపా, మధ్యతూర్పులలో కంచు యుగము, ఇనుప యుగంలో లోహాలను ఫోర్జ్ వెల్డింగు పద్ధతిలో అతికేవారని తెలుస్తున్నది. క్రీ.పూ. 5వ శతాబ్దికి చెందిన ప్రాచీన గ్రీకు చరిత్రకారుడు హెరొడొటస్ (Herodotus) తన ది హిస్టొరిస్ అను పుస్తకంలో చియొస్ (chios) కు చెందిన గ్లాకస్ (glaucus) మొదటగా ఇనుమును ఫొర్జింగు ద్వారా వెల్డింగ్ చేసిన వ్యక్తిగా పేర్కొన్నాడు. ఆలాటి ఫొర్జ్ వెల్డింగు కు, సా.శ.310 లో ఢిల్లీ సమీపంలోని కుతుబ్ మీనారు వద్ద నున్న ఉక్కు స్తంభము ఉదాహరణ. సా.శ.1802 లో రష్యన్ శాస్త్రవేత్త వసిలి పెట్రొవ్ (vasily petrov) విద్యుత్తు ట్రాన్సు ఫార్మరులో తక్కువ వోల్టేజి (70-100 వోల్టులు), ఎక్కువ అంపియర్ల విద్యుత్తు ఏర్పరచి, ట్రాన్సుఫార్మరు యొక్క ఋణధ్రువ అంచును, ధనధ్రువ అంచుతో తాకించి వాటి మధ్య కొంత దూరముండు నటుల చేసినచో అత్యంత ఉష్ణమును విడుదల చేస్తూ, ఒక ప్రకాశవంతమైన వెలుగు (electric Arc) ఏర్పడటాన్ని కనుగొన్నాడు, ఇలా వెలువడు ఈ ఉష్ణశక్తితో లోహాలను అతుకవచ్చునని భావించాడు. సా.శ.1881-82 లో రష్యాకు చెందిన నికొలై బెనర్డొస్ (Benardos), విద్యుత్తు ఆర్కు (Arc) తో కార్బన్ ఎలక్ట్రోడ్ నుపయోగించి వెల్డింగు చెయ్యడం కనుగొన్నాడు.[2] ఈ పద్ధతిలో లోహలను వెల్డింగ్ చెయ్యడం 18వ శతాబ్ది చివరివరకు వరకు కొనసాగింది. అటుపిమ్మట 1888 లో రష్యాకు చెందిన నికొలై స్లాయోనొవ్ (1888), అమెరికాకు చెందిన సి.ఎల్.కాపిన్ (1890) లో లోహపు కడ్డీని ఎలక్ట్రోడుగా వెల్డింగు చేయు ప్రక్రియను ఆవిష్కరించారు. సా.శ.1990 ప్రథమం లో ఎ.పి.స్త్రో హెమెంజెర్ (Strohemenger) బ్రిటన్లో రసాయనిక పదార్థముల పూతకలిగిన ఎలక్ట్రోడును తయారుచేసాడు. ఇది పైరెండింటికన్న నిలకడగల ఆర్కును ఏర్పరచడం వలన, వెల్డింగు మరింత సులభ తరమై నది. ఈ ఎలక్ట్రోడును పూత గల్గిన (sheathed metal electrode) ఎలక్ట్రోడ్ అంటారు. సా.శ.1905లో మూడు ఫేజుల కరెంట్ ద్వారా వెల్డింగును చేయు పద్ధతిని రష్యాకు చెందిన శాస్త్రవేత్త వ్లదిమిర్ మిత్‍కెవిచ్ ఆవిష్కరించాడు. ఈ వెల్డింగ్ పద్ధతులన్ని ఏకముఖ విద్యుత్తు (direct current) ను ఉపయోగించునవి. సా.శ.1919లో సి.జె.హొల్స్లగ్ ఎ.సి. (alternative current) విద్యుత్తు నుపయోగించి వెల్డింగు చేయుటను కను గొన్నాడు. అయితే ఇది దాదాపు పది సంవత్సరాల వరకు ప్రజాదరణ పొందలేదు. ప్రస్తుతం ఎ.సి కరెంట్ సింగల్ పేజ్, లేదా డబుల్ పేజ్ ద్వారా వెల్డింగ్ చేయుట సర్వసాధారణము. అలాగే రెసిస్టెన్సు అనే మరో రకపు వెల్డింగు ప్రక్రియ కూడా 19వ శతాబ్దిలోనే కనుగొన బడింది. సా.శ.1885లో ఎల్హు థొమ్సను అనునతను రెసిస్టెన్సు వెల్డింగు పద్ధతిపై యాజమాన్య హక్కులు (patent) పొందాడు.అలాగే థెర్మెట్ (thermet) అనే మరోరకమైన వెల్డింగు విధానము 1893లో కనుగొనబడింది. అదే సమయంలో అసెటెలిన్ (Acetelene) గ్యాసు నుపయోగించి వెల్డింగు చేయు పద్ధతి కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ గ్యాసు వెల్డింగు అనునది 1836లో ఎడ్మండ్‍ డేవిడ్ కనుగొన్నను,1890లో గాని పూర్తి వాడుకలోకి రాలేదు. గ్యాస్ వెల్డింగు చేయు బ్లో టార్చు/వెల్డింగు టార్చును ఆధునీకరణించడం వలన 19 వ శతాబ్దిలో గ్యాస్ వెల్డింగుతో లోహాలను అతుకుట కుడా జోరందుకున్నది. అయితే పెద్ద ఉక్కు వంతెనలను, ఓడలను, సైనికదళాలకు సంబంధించిన వాటిని. వాహనాలను నిర్మించుటకు ఆర్కు వెల్డింగు అనుకూలంగా ఉండటం, పూరకకడ్డిలపై (filler electrode) రక్షిత స్రావకాన్ని (flux) పూతగా పూయడం వలన ఆర్కు వెల్డింగులో వెల్డింగు చేయు భాగాన్ని ఆక్సీకరణ నుండి రక్షించు పరిస్థితులు గతం కంటే మెరుగ్గా ఉండటం వలన ఆర్కు వెల్డింగు నుపయోగించడం ఊపందుకున్నది. సా.శ.లో స్వయం చలిత (automatic) ఆర్కు వెల్డింగును కనుగొనడం జరిగింది. అంతకుమునుపు అర్కు వెల్డింగులో ఉపయోగించు స్రావకపూత కలిగిన పూరక ఎలక్ట్రోడ్ 350-450 మి.మీ, పొడవు వున్నందున, ఒక ఎలక్ట్రోడు తరువాత మరో ఎలక్ట్రోడును వెల్డింగు హొల్డరుకు బిగించి వెల్డింగు చెయ్యవలసి వచ్చేది. కాని ఈ ఆటోమెటిక్ వెల్డింగు విధానంలో వెల్డింగు ఎలక్ట్రోడు సన్నగా ఉండి ఒకచక్రమునకు చుట్టబడి, వెల్డింగుకు అనుకూలంగా ముందుకు జరుగుచుండును. వెల్డింగు ప్రాంతం ఆక్సికరణ చెందకుండ రక్షితవాయువు (shield gas) వెల్డింగు పై ప్రసరించడం జరుగుతుంది. రక్షిత వాయువులుగా వెల్డింగుచేయు లోహలలో జడవాయువు లను (inert gas) ఉపయోగిస్తారు. జడవాయువులను అధిక వత్తిడితో వెల్డింగు జాయింట్ పరిసరాలలో పంపించడం ద్వారా వెల్డ్ జాయింటుకు గాలి అందుబాటులో లేకుండచేయును. ఇవి, ఆర్గాను, హీలియము, హైడ్రోజను+ఆర్గాను మిశ్రమము. (హైడ్రోజను జడవాయువుకాదు, కాని వెల్డింగు జాయింట్ పరిసరాలలోని ఆక్సిజను తోచర్య జరపడం ద్వారా (2H+O=H 2 O, వెల్డింగు జాయింట్ అక్సిజనుతో ఆక్సికరణ చెందకుండ నిరోధించును). ఆ తరువాత క్రమములో 1932 లో స్టడ్ వెల్డింగు విధానము వాదుకలోకి వచ్చింది. ఆదే సమయంలో రష్యాకు చెందిన కొన్ స్టాంటిన్ క్రెనొవ్ (konstanitin khrenov) నీటిలోపల ఆర్కు వెల్డింగుచేయు విధానాన్ని కనుగొన్నాడు. అంతకుముందే కనుగొనబడి అనేక మార్పులకు గురైన గ్యాస్ టంగ్స్టన్ ఆర్కు వెల్డింగ్ (TIG= tungsten inert gas ) విస్త్రుతంగా వాడుకలోకి తీసుకు రాబడింది. అటుపిమ్మట గ్యాస్ మెటల్ ఆర్కు (MIG=metal inert gas) వెల్డింగును కూడా అభివృద్ధి పరచి వాడుకలోకి తీసుకురావటం జరిగింది. ఆటు పిమ్మట ప్లాస్మా ఆర్కు వెల్డింగు, ఎలెక్ట్రో స్లాగ్ వెల్డింగు, ఎలెక్ట్రోను బీం వెల్డింగు వంటి విధానాలతో వెల్డింగు చెయ్యడం మొదలైనది.[3]

వెల్డింగులోని రకాలు

[మార్చు]

లోహలను అతుకుటలో పలు రకాలు (kinds of welding) ఉన్నాయి.

  1. ఫోర్జ్ వెల్డింగు : ఈ విధానంలో వెల్డింగ్ చెయ్యవలసిన లోహాన్ని ద్రవీభవన ఉష్ణోగ్రత కన్న కొంచెము తక్కువ ఉష్ణోగ్రత వరకు కొలిమిలో వేడిచేసి, బాహ్యాబలం/వత్తిడి నుపయోగించి (సుత్తిలేదా సమ్మెటతో మోది) కావలసిన ఆకారము వచ్చునట్లు చెయ్యడం. ఈ విధానం గతంలో విస్తృతంగా వాడుకలో నుండెను. ప్రస్తుతం అధునాత ఫోర్జ్ వెల్డింగు విధానంలో కావలసిన ఆకారంకోసం ముందుగా రెండు భాగాలుగా ఉన్న అచ్చులు (Die) తయారుచేసి, లోహాన్ని సంప్రదాయ కొలిమిలో (hearth) కాకుండగా విద్యుత్తు లేదా గ్యాసు ద్వారా పనిచేయు అధునాతన కొలిమి (Furnace) లో తగిన ఉష్ణోగ్రత వరకు వేడిచేసి, లోహపుముద్దను అచ్చులలో ఉంచి, హైడ్రాలిక్ వత్తిడి నుపయోగించి నొక్కడం ద్వారా కావలసిన ఆకారంలో వస్తువు ఏర్పడుతుంది. ఈ విధానంలో పరిశ్రమలో విరివిగా ఉపయోగించు వాల్వులు (valves), యంత్రభాగాలు, పరికరాలు తయారుచేయుదురు. ఈ పై రెండు పద్ధతులలో ఉష్ణం, బలమైన బాహ్యవత్తిడి (pressure) అవసరం. ఆలా కాకుండగా తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రత, సులభంగా తక్కువ వత్తిడి వద్ద రూపం మార్చుకొను (highly ductile) లోహాలను వేడి చెయ్యకుండానే అచ్చులలో ఉంచి హైడ్రాలిక్ ప్రెస్సరు ద్వారా కావలసిన వస్తువులను తయారుచెయ్యడాన్ని కోల్డ్ ఫోర్జింగ్ అంటారు.
  2. టంకము : ఈ వెల్డింగు ప్రక్రియ కూడా పురాతనమైనదే. ఇందులో అతుకవలసిన లోహన్ని/లోహలను వేడి చెయ్యడం కాని, లేదా బాహ్యవత్తిడిని ప్రయోగించడం కాని ఉండదు. టంకములో పూరక లోహంగా (filler metal) ఉపయోగించు దానిని మాత్రమే కరగించి లోహాలను అతకడం జరుగుతుంది. వెల్డింగు చేయుప్రదేశం ఆక్సికరణ చెందకుండ ద్రవ లేదా పొడి స్రావకాన్ని (flux) వాడెదరు. అతుకబడు లోహాలను బట్టి పూరకలోహం, స్రావకాలు మారును. పూరకలోహాన్ని కరగించుటకు ఉపయోగించు సన్నని వాడి అంచుగల, పిడిగల ఉక్కుకడ్డిని సోల్డరింగ్ ఐరన్ అంటారు. గతములో ఈ కడ్డీని బొగ్గుల కొలిమిలో ఎర్రగాకాల్చి టంకం చేయుట కుపయోగించేవారు. ప్రస్తుతం విద్యుత్తుతో పనిచేయు సోల్డరింగ్ రాడులు వినియోగంలో ఉన్నాయి. నూనెడబ్బాల మూతలను, ఇనుప పెట్టెలభాగాలను అతుకుటకు తగరము (tin) లేదా తగరము-సీసము (lead) మిశ్రమ ధాతులోహాన్ని వాడెదరు. స్రావకంగా మైలితుత్తము (copper sulphate), కొన్ని చోట్ల బోరాక్సు (వెలిగారము) ను ఉపయోగిస్తారు. విలువైన బంగారు, వెండి ఆభరణములు చేయుటకు పూరకలోహంగా వెండి లేదా దాని మిశ్రమధాతువులను వాడెదరు. టంకం లేదా సోల్డరింగును ఎలక్ట్రికల్, ఎలక్టాన్ పరిశ్రమలలో విరివిగా వాడెదరు. రేడియా, టెలివిజను, టేపురికార్డరు, కంప్యూటరు వంటి ఎలక్ట్రాను వస్తువులలోని ప్రింటెడ్ సర్క్యూ ట్ బోర్డులోని సర్క్యూటులో ఎలాక్ట్రాన్ పరికరాలు/భాగాలను ఈ సోల్డరింగ్ పద్ధతిలోనే అతుకుదురు.
  3. ఆర్కు వెల్డింగ్ : పై మూడు వెల్డింగు ప్రక్రియల కన్న భిన్నమైనది ఆర్కువెల్డింగు. ఈ ఆర్కు వెల్డింగు పద్ధతిలో విద్యుత్తు ద్వారా ఆర్కును (Arc) ను సృష్టించి దానిద్వారా అతుకవలసిన లోహభాగాలను కరిగించి (fusion) లోహాలను జోడించడం జరుగును. ఇది ఫ్యూజన్ వెల్డింగు (fusion). ఈ వెల్డింగు విధానములో బాహ్యవత్తిడి ప్రయోగము ఉండదు. ఒక బలమైన విద్యుత్తు వలయంలోని అనోడు (anode) (ధనధ్రువము) ను, కెథోడ్ (cathode) కు తాటించి విద్యుతు ప్రవాహము ఏర్పరచి, రెండు ధ్రువాల మధ్య 3-4 మీ.దూరము ఉండేలా చేసినప్పుడు, రెండింటి మధ్య ప్రకాశవంతమైన వెలుగు వలయక్షేత్రము (Arc) ఏర్పడును. ధన, ఋణ ధ్రువాలను తాటించినప్పుడు ఈ క్షేత్రపరిధిలోని ఎలక్ట్రాన్‍కణాలు అయనీకరణంచెంది వేగంగా కాథోడు ధ్రువంవైపు ప్రయాణించి, కాథోడును బలంగా గుద్దటం వలన ఏర్పడిన వత్తిడివలన ఉష్ణం జనించును.రెండు ధ్రువాలమధ్య ఈ దూరం స్థిరంగా ఉన్నంతసేపు ఆర్కునిలచి ఉండును.ఈదూరాన్ని బాగా తగ్గించిన లేదా పెంచిన ఆర్కు ఆగిపోవును.ఈ ఆర్కు వలన ఏర్పడు ఉష్ణోగ్రత, ఆర్కువలయం కేంద్రము వద్ద దాదాపు6000-70000C ఉండును, వలయం బయట ఉష్ణోగ్రత తీవ్రత 2800-30000C ఉండును.ఈ ఉష్ణోగ్రత వద్దనున్న ఏలోహమైన సులభంగా ద్రవీకరణచెందును. ఈ వెల్డింగు పద్ధతిలో ఆర్కువలన ఏర్పడిన ఉష్ణోగ్రతతో లోహాన్ని కరగించి (fusion) ఒకదానితో నొకటిని అతికించడం జరుగుతుంది. అందుచే ఈ వెల్డింగు పైన పేర్కొన్న వెల్డింగు కన్న భిన్నమైనది. ఆర్కువెల్డింగులో చాలా రకాలున్నాయి. కొన్నిఅర్కువెల్డింగు పద్ధతులలో పూరకలోహము (Filler) ను ఎలక్ట్రోడుగా ఉపయోగించగా, కొన్నింటిలో పూరక లోహాన్ని వేరుగా ఉపయోగిస్తారు. ఆర్కు వెల్డింగును మొదట నేరువిద్యుత్తు (Direct current) ద్వారా చేయగా ప్రస్తుతము A.C. D.C. విద్యుత్తు ద్వారా చేస్తున్నారు.[4]
  4. గ్యాస్ వెల్డింగ్ :గ్యాస్ వెల్డింగ్‍లోకూడా అతుకవలసిన లోహభాగాలను కరిగించి (fusion) అతుకు ప్రక్రియ. ఆర్కు వెల్డింగులో అతుకుటకు అవసరపడు ఉష్ణాన్ని విద్యుతు ద్వారాకాగా, గ్యాసు వెల్డింగులో వాయువులను మండించి, వెలువడు ఉష్ణం ద్వారా అతుకవలసిన భాగాలను కరిగించి జోడించడం జరుగును. గ్యాసువెల్డింగులో అసిటెలిన్ (acetylene) వాయువును, సాధారణంగా దహన వాయువుగా ఉపయోగించెదరు. వెల్డింగు చేయుటకు గ్యాసువెల్డింగు టార్చును ఉపయోగిస్తారు. ఆక్సిజను, అసెటెలిన్ వాయువులను టార్చిద్వారా తగిన నిష్పత్తిలో (1.1;1) కలిపి మండించినప్పుడు, టార్చియొక్కనాజిల్ టిప్పు ద్వారా వెలువడు మంట యొక్క ఉష్ణోగ్రత 3000-32000C వుండును. గ్యాసువెల్డింగులో పూరకలోహాన్ని గాని, స్రావకాన్ని గానీ వినియోగిస్తారు. గ్యాసువెల్డింగులో మరోపద్ధతి బ్రేజింగు. ఈవిధానం టంకం (soldering), గ్యాసువెల్డింగుల మిశ్రమ పద్ధతి. ఇందులో గ్యాసుమంట నుపయోగించినప్పటికి, గ్యాసువెల్డింగులో వలె అతుకవలసిన లోహభాగాలను కరగించడం ఉండదు. కేవలం మంట ద్వారా టంకం విధానంలోలాగా పూరక లోహన్ని మాత్రమే కరగించి వెల్డింగు చేయుదురు. ఇందులో కూడా వెల్డింగు చేయు భాగం ఆక్సీకరణకు లోను కాకుండుటకై స్రావాకాన్ని వాడెదరు.[5]
  5. రెసిస్టెన్సు (Resistance) వెల్డింగు : ప్రతి లోహం/మూలకం ఉష్ణవాహకతత్వాన్ని కలిగివున్నప్పటికి, అన్నియు ఒకే రకమైన వాహకగుణాన్ని కలిగివుండవు. లోహము లేదా మూలకం యొక్క అణు కణనిర్మాణాన్ని అనుసరించి కొన్ని ఉత్తమవాహకాలు గాను, కొన్ని అధమ వాహకాలుగాను ప్రవర్తిస్తాయి. వస్తువులోని కణాలు తమ గుండా ప్రవహించు ఉష్ణ, విద్యుత్తుశక్తి కణాలను అంతో ఇంతో నిరోధించుటకు ప్రయత్నిస్తాయి. తక్కువ నిరోధాన్ని ప్రదర్శించునవి ఉత్తమ ఉష్ణ, విద్యుత్తువాహకాలు అనీ, ఎక్కువ నిరోధం కలిగించువాటిని మధ్యమ, అధమ ఉష్ణ, విద్యుత్తువాహకాలనీ అంటారు. బంగారం, వెండి, రాగి వంటి లోహాలు తక్కువ వాహక నిరోధతత్వాన్ని కలిగి ఉన్నాయి. లోహం ఉష్ణోగ్రత పెరిగే కొలది వాహక నిరోధకగుణము పెరుగుతుంది. లోహాల ఈ రెండు గుణాలను ఆధారంగా చేసుకొని (వాహకనిరోధక గుణం, ఉష్ణో గ్రత పెరిగే కొలది వాహకగుణంతగ్గటం) చేయు అతుకుప్రక్రియను రెసిస్టెన్సు వెల్డింగు అంటారు[6].
  6. థెర్మిట్‍వెల్డింగు (thermit) లేదా థెర్మో-కెమికల్‍ వెల్డింగు:ఈ పేరు వినగానే తెలిసిపొతున్నది, ఉష్ణం (themo), రసాయనపదార్థాలను (chemical) ఉపయోగించిచేయు అతుకుప్రక్రియ యని. 3000-3200) C ఉష్ణోగ్రత కలిగిన ద్రవాన్ని వెల్డింగు చెయ్యవలసిన భాగం చుట్టూ నింపండం ద్వారా చేయు వెల్డింగు. ఇందులో ఉపయోగించునవి అల్యూమినియం పౌడరు, ఫెర్రస్ ఆక్సైడు పొడుల మిశ్రమము. ఈ రెండింటి మిశ్రమాన్ని మండించినప్పుడు, ఈ రెండింటిమధ్య చర్య జరుగునప్పుడు అధిక మొత్తంలో ఉష్ణం వెలువడి మిశ్రమాన్ని ద్రవస్థితికి తెచ్చును, ఈ ద్రవాన్ని లోహభాగాలను అతుకుటకు ఉపయోగించెదరు.[7]
  7. వికిరణశక్తి అతుకు ప్రక్రియ (Radiant energy welding) : కిరణాలను శక్తి ఆవేశితాలను చేసి, అతుకవలసిన భాగాలపై వేగంగా ప్రసరింపచేసి అతుకు ప్రక్రియ. శక్తి ఆవేశితమైన కిరణాలను కటకం ద్వారా ప్రసరింపచేసి, కేంద్రీకరించి అతుకవలసిన లోహాభాగంపైకి పంపి వెల్డింగు చేయుదురు[8].

ఇవికాక సాలిడ్‍స్టేట్ అను వెల్డింగు విధానము ద్వారా కూడా లోహాలను అతికెదరు.

లోహాలను వెల్డింగుచేయు వివిధ పద్ధతులు (Methods of welding)

[మార్చు]

ఆర్కు వెల్డింగు

[మార్చు]
  1. కార్బను ఆర్కువెల్డింగు (carbon Arc welding.)
  2. మెటల్ ఆర్కువెల్డింగు ( Metal Arc welding).
  3. ఫ్లక్సుకోర్డు ఆర్కువెల్డింగు (Flux cored Arc welding).
  4. సబ్‌మెర్జ్‌డ్ ఆర్కువెల్డింగు (submerged Arc Welding.)
  5. టిగ్ వెల్డింగు (TIG/GTAW :Tungstan inert gas/gas tungstan Arcwelding).
  6. మిగ్ వెల్డింగు (MIG/GMAW:Metal inert Gas/gas metal Arc Welding).
  7. ప్లాస్మా ఆర్క్ వెల్డింగు (plasma Arc welding).
  8. స్టడ్‍ వెల్డింగు (stud welding).

గ్యాసు వెల్డింగు (gas Welding)

[మార్చు]
  1. గాలి ఎసిటిలిన్ వెల్డింగు (Air acetylene welding
  2. ఆక్సి ఎసిటిలిన్ వెల్డింగు (oxyacetylene welding)
  3. ఆక్సి హైడ్రొజన్‍ వెల్డింగు (oxyhydrogen welding)
  4. ప్రెసరుగ్యాస్‍ వెల్డింగు (pressure gas welding)

రెసిస్టన్సు వెల్డింగు (resistance welding)

[మార్చు]
  1. స్పాట్ వెల్డింగు (spot Welding)
  2. సీమ్‍ వెల్డింగు (seam welding)
  3. ప్రొజెక్షను వెల్డింగు (Projection Welding)
  4. రెసిస్టన్సు బట్ వెల్డింగు (resistance Butt Welding)
  5. ఫ్లాష్ బట్ వెల్డింగు (Flash Butt Welding)
  6. పెకాసిన్ వెల్డింగు (Percussion Welding)
  7. ఉక్కు గొట్టాల ఎలక్ట్రిక్ రెసిస్టన్సు వెల్డింగు
  8. హై ఫ్రీక్వెన్సీ రెసిస్టన్సు వెల్డింగ్ (High frequency Resistance Welding)

ఘనస్థితి వెల్డింగు (solid state welding)

[మార్చు]
  1. కోల్డు వెల్డింగు (Cold welding)
  2. డిఫ్యూజన్ వెల్డింగు (Difussion welding)
  3. ఎక్స్‌ప్లెసివ్ వెల్డింగు (explosive welding)
  4. ఫోర్జ్‌ వెల్డింగు (forge welding)
  5. ఫ్రిక్షను వెల్డింగు (friction welding)
  6. ఆల్ట్రాసోనిక్ వెల్డింగు (Ultrasonic welding)

థెర్మో-కెమికల్(Thermo-chemical welding)వెల్డింగు

[మార్చు]
  1. థెర్మిట్ వెల్డింగు (Thermit)

వికిరణశక్తి (Radiant Energy) వెల్డింగు పద్ధతి

[మార్చు]
  1. ఎలక్ట్రాన్ బీమ్ వెల్డింగు (Electron Beam welding)
  2. లేజరు బీమ్ వెల్డింగు (Laser Beam welding)

ఇతర వెల్డింగు విధానాలు

[మార్చు]
  1. నీళ్ళలో వెల్డింగు (Under water Welding)

ఇవి కూడా చూడండి

[మార్చు]

సోల్డర్

బయటి వనరులు

[మార్చు]

[1] Archived 2014-07-03 at the Wayback Machine వెల్డింగు చరిత్ర

సూచికలు

[మార్చు]
  1. "Classification of welding processes". substech.com. Retrieved 2014-03-04.
  2. "A History of Welding & Brazing". weldinghistory.org. Retrieved 2014-03-04.
  3. "The History of Welding". millerwelds.com. Archived from the original on 2012-11-29. Retrieved 2014-03-04.
  4. "Electric Arc Welding". clarion.edu. Retrieved 2014-03-04.
  5. "GAS WELDING - OXYACETYLENE". technologystudent.com. Retrieved 2014-03-04.
  6. "What is Resistance Welding?". miyachi.com. Archived from the original on 2014-02-08. Retrieved 2014-03-04.
  7. "Thermit". science.howstuffworks.com. Retrieved 2014-03-04.
  8. "Welding Process Technology". books.google.co.in. Retrieved 2014-03-04.