Jump to content

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు

వికీపీడియా నుండి
(వెలిగొండ ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు is located in ఆంధ్రప్రదేశ్
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు
స్థానం
దేశంభారతదేశం
ప్రదేశంకాకర్ల, గొట్టిపడియ, సుంకేసుల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఆవశ్యకతసాగునీరు & తాగునీరు
స్థితినిర్మాణం జరుగుతున్నది
నిర్మాణం ప్రారంభం2006
యజమానిఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆనకట్ట - స్రావణ మార్గాలు
ఆనకట్ట రకంఆనకట్ట
జలాశయం
సృష్టించేదినల్లమల జలాశయం
మొత్తం సామర్థ్యం43.5 TMC

పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రకాశం జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న భారీ నీటిపారుదల ప్రాజెక్టు.[1] నీటిని శ్రీశైలం జలాశయం ముందలి భాగంలో గల కొల్లం వాగు నుండి రెండు సొరంగ మార్గాల ద్వారా, ఆ తరువాత వరద కాలువ ద్వారా పంపి, నల్లమల కొండలశ్రేణిలో సుంకేశుల, గొట్టిపడియ, కాకర్ల వద్ద ఖాళీలలో కట్టిన ఆనకట్ట ద్వారా ఏర్పడిన జలాశయంలో నింపుతారు. ఈ జలాశయం 43.50 టిఎమ్సి (TMC) నీటిని నిల్వచేయగలదు.

మొదటి దశ ప్రతిపాదనలు 1994 డిపిఆర్ పై ఆధారపడినవి. శ్రీశైలం జలాశయం దగ్గర సంవత్సరంలో 45రోజుల వరద నీరు వుంటుందనే అంచనా పై ఆధారపడినవి. అందువలన 10.7టిఎమ్సి నీటిని 45 రోజులలో 7 మీటర్ల వ్యాసంగల, 85 క్యుమెక్స్ సామర్ధ్యంగల సొరంగం కాలువ ద్వారా తరలించాలని ఆశించారు. ఇది 2004-2005 లో జరిగింది. రెండవ దశ పనులలో భాగంగా 9.2 మీ వ్యాసంగల, 243 క్యుమెక్స్ సామర్ధ్యంగల రెండవ సొరంగ కాలువ జతచేయబడింది. దీనితో 30 రోజుల వరదనీటితోనే జలాశయం నిండి పోయే అవకాశం ఉంది.

నల్లమల జలాశయం నుండి మూడు సాగునీటి కాలువలు తీగలేరు కాలువ (62,000 ఎకరాలు), గొట్టిపడియ కాలువ (9,500 ఎకరాలు), తూర్పు కాలువ (3,70,800 ఎకరాలు) మొత్తం 4,47,300 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తాయి. ఈ సంఖ్యలో గుండ్లబ్రహ్మేశ్వరం జలాశయం ద్వారా (3,500ఎ.), రాళ్లవాగు జలాశయం (1500ఎ.) లాంటి ఇతర స్వతంత్ర ప్రతిపత్తి గల జలాశయాల ద్వారా నీరు సమకూర్చడం చేరివున్నాయి. కాలువల మార్గంలో, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలలోని 30 మండలాలోని 15.25 లక్షమందిప్రజలకు తాగునీరు సాకర్యం లభిస్తుంది.

చరిత్ర

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినల్లమల అడవులలో ఉన్న కొండల వరుసను వెలుగొండలు అంటారు. ఈ కొండలు వైఎస్ఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా, చిత్తూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కర్నూలు జిల్లాలలో వ్యాపించి ఉన్నాయి. ఈ కొండల మధ్య ఖాళీలలో ఆనకట్టల నిర్మాణం చేసే ప్రాజెక్ట్ ను వెలిగొండ ప్రాజెక్టు అని తొలుత పిలిచారు. ప్రకాశం జిల్లాలో కరవు ప్రాంతాలకు సాగు, తాగు నీరు, నెల్లూరు జిల్లాలో బాగా వెనకపడ్డ ఉదయగిరి ప్రాంతం, కడప జిల్లా బద్వేల్ ప్రాంతంలోని మొత్తం 30 మండలాలలోని 15 లక్షల మందికి తాగునీరు, మొత్తం 459,000 ఎకరాలకు సాగు నీరు ఇచ్చే ఉద్దేశంతో శ్రీశైలం డ్యాం వెనక వైపు నుంచి కృష్ణా నీటిని ఇవ్వటానికి ఈ ప్రాజెక్టు ఉద్దేశించబడింది. కృష్ణా నదిలో 43.5 టి.ఎం.సి. వరద నీటిని కొల్లంవాగు సమీపంలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తరలించి నల్లమలసాగర్ రిజర్వాయర్లో నిల్వ చేయాలని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుకు “పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు" అని నామకరణం చేసారు.[2][3] మార్కాపురానికి 25 కి.మీ దూరంలో వెలిగొండ అనే కొండగుహలో వెలిసిన “వేంకటేశ్వర స్వామి”ని వెలిగొండస్వామి అని అంటారు. మార్కాపురం, యర్రగొండపాలెంల నుంచి పలుసార్లు శాసనసభ్యునిగా గెలిచిన పూల సుబ్బయ్య, ప్రకాశం జిల్లాలో పాటు మరికొన్ని జిల్లా ప్రాంతాలకు సాగునీరు, త్రాగునీరు అందించడానికి పోరాటం చేసాడు. అతని పేరు మీద ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు అనే పేరు పెట్టారు.

శ్రీశైలం డ్యాం ఎగువున నల్లమల అడవిలో “కొల్లం వాగు” కృష్ణా నదిలో కలిసేచోట నుంచి 43.5 TMCల వరద నీటిని 200 మీటర్ల అప్రోచ్ కాలువతో పారించి అక్కడి నుంచి 18.8 కి.మీ పొడవున 2 సమాంతర సొరంగాల ద్వారా దోర్నాల కర్నూలు రహదారిలో “కొత్తూరు” వరకు నీటిని పారించి అక్కడ నుంచి సుమారు 22 కి.మీ పొడవైన కాలువ ద్వారా పారించి “నల్లమల సాగర్”లో నిలవ చేసి అక్కడి నుంచి వివిధ కాలువల ద్వారా నిర్దేశిత ప్రాంతాలకు నీటిని అందించాలి. కొండల శ్రేణిలో మధ్య ఖాళీ స్థలంలో వున్న సుంకేసుల, గొట్టిపడియ, కాకర్ల అనే మూడు గ్రామాల దగ్గర గోడలలాగ ఆనకట్టలు కట్టి సుమారు 20 కి.మీ పొడవైన సహజమైన “నల్లమల సాగర్” రిజర్వాయర్ను నిర్మించారు. సొరంగ నిర్మాణానికై అమెరికా, జర్మనీల నుంచి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక టన్నెల్ బోరింగ్ మిషన్లను ఈ వెలిగొండ ప్రాజెక్టు పనులకు ఉపయోగించారు. నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వు ప్రాంతంలోని వన్యప్రాణి జీవనానికి అవాంతరం కలిగించకుందా టన్నెల్ నిర్మాణం జరిగుతోంది.[4]

ఈ ప్రాజెక్టును 1996 మార్చి 5 న అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటిసారి మార్కాపురానికి 15 కి.మీ దూరంలో వున్న గొట్టిపడియ దగ్గర శంకుస్థాపన చేశాడు. ప్రాజెక్టును 5 సంవత్సరాలలో పూర్తి చెయ్యాలని లక్ష్యం పెట్టారు కాని 2000 మే చివరి వరకు అనుమతులు రాలేదు. 2001లో సాంకేతిక సలహా కమిటీ వేశారు. కమిటి రిపోర్టు ఇచ్చిన తరువాత ఒక స్విట్జర్లాండ్ కంపెనీకి 2.5 కోట్ల బడ్జెట్తో పూర్తి ప్రాజెక్టు నమూనాను తయారు చెయ్యమని కాంట్రాక్ట్ ఇచ్చారు. కాని వాళ్ళు పని మొదలు పెట్టలేదు. ఇంతలో 2004 ఎన్నికలలో తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2004 అక్టోబరు 27న మళ్ళీ అదే గొట్టిపడియ దగ్గర వై.యస్. రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసి నిధులు విడుదల చేశారు. 1996 లో 980 కోట్ల అంచనాగా ఉన్న ప్రాజెక్టు విలువ 2005 నాటికి 5,500 కోట్లకు చేరింది. 2014 నాటికి 5 ప్రధాన కాలువలు 80% పూర్తి అయ్యాయి. 3 ఆనకట్టలు పూర్తి చేశారు. కాని నీటిని నది నుంచి అడవిని దాటి మైదానానికి తీసుకు రావలసిన సొరంగాల పనులు పూర్తి కాలేదు.[5]

నిర్వాసితులకు పునరావాసం, పరిహారం

[మార్చు]

ఈ ప్రాజెక్టు వలన 11 గ్రామాలు ముంపుకి గురయ్యాయి. ఎనిమిది గ్రామాలలోని ప్రజలకు పరిహారం చెల్లించారు. ఆరు ముంపు గ్రామాలకు పునరావాస కేంద్రాలు గుర్తించి వసతులు కల్పిస్తున్నారు.[6] ప్రాజెక్టు సుదీర్ఘ కాలం పట్టటంతో పరిహారంలో ఆలస్య జరగటం, ప్రాతిపదిక మారకపోవటం వలన నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారు[7]

ముంపు గ్రామం పునరావాస గ్రామం కుటుంబాల సంఖ్య
కలనూతల ఇడుపూరు-1, ఇడుపూరు-2 625
గుండంచర్ల (కలనూతల) తోకపల్లి 715
చింతలముడిపి (కలనూతల) గోగులదిన్నె 47
కోటంరాజుతండ (కలనూతల) గోగులదిన్నె 25
సుంకేశుల గోగులదిన్నె 715
గొట్టిపడియ వేములకోట 830
అక్కచెరువు వేములకోట 83
సాయినగర్ (కాకర్ల) ఒందుట్ల 13
రామలింగేశ్వరపురం (కాకర్ల) ఒందుట్ల 25
కృష్ణానగర్ (కాకర్ల) ఒందుట్ల 38
లక్ష్మీపురం (కాకర్ల) ఒందుట్ల 139
మొత్తం 3863

ఆయకట్టు ప్రాంతం

[మార్చు]
వెలిగొండ పథకం భాగాలు
వెలిగొండ పథకం భాగాలు
వెలిగొండ ఆయకట్టు (2004 నాటి ప్రతిపాదన)
వెలిగొండ ఆయకట్టు (2004 నాటి ప్రతిపాదన)

తూర్పు ప్రధాన కాలువ

[మార్చు]

తూర్పు ప్రధాన కాలువ కాకర్ల దగ్గర 543 మీటర్ల పొడవైన సొరంగ మార్గంతో ప్రారంభమై, ప్రకాశం నెల్లూరు జిల్లాలలో 199.9 కిమీ ప్రవహించి పెద్దిరెడ్డిపల్లి సమతుల్యన జలాశయంలో కలుస్తుంది.[8]

శాఖా కాలువలు

[మార్చు]
పశ్చిమ శాఖా కాలువ

ఇది తూర్పు ప్రధాన కాలువలో 24.45 కిమీ దగ్గర చీలి, 22.7 కిమీ ప్రకాశం జిల్లాలో ప్రవహించి గిద్దలూరు చేరుతుంది.

రాయవరం శాఖా కాలువ

ఇది తూర్పు ప్రధాన కాలువలో 86.715 కిమీ దగ్గర చీలి, 9.8కిమీ ప్రకాశం జిల్లాలో ప్రవహించి రాయవరం చేరుతుంది

ఉదయగిరి కాలువ

ఇది నెల్లూరు జిల్లాలో పెద్దిరెడ్డిపల్లి జలాశయం నుండి ప్రారంభమై వరికుంటపాడు, దుత్తలూరు, మరిపాడు, ఉదయగిరి మండలాల్లో 18 కిమీ ప్రవహించి బొగ్గేరు నదిలో కలుస్తుంది.

తీగలేరు కాలువ

[మార్చు]

తీగలేరు కాలువ నల్లమల జలాశయం ఉత్తర భాగంలో చెర్లపల్లి గ్రామం దగ్గర 400 మీటర్ల పొడవైన సొరంగం ద్వారా ప్రారంభమై 48.15 కిమీ ప్రవహించి చిన్నకందలేరు చేరుతుంది.

గొట్టిపడియ కాలువ

[మార్చు]

గొట్టిపడియ కాలువ గొట్టిపడియ ఆనకట్ట దగ్గర ప్రారంభమై 12 కిమీ ప్రవహించి ఇదుపూరు దగ్గర గుండ్లకమ్మలో నదిలో కలుస్తుంది.

ప్రాజెక్టు పురోగతి

[మార్చు]
  • 2015 మే నాటికి 12.6 కిలోమీటర్ల మొదటి సొరంగం త్రవ్వకం పూర్తయినది. రెండవ సొరంగం త్రవ్వకం 8.1 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. ఈ ప్రాజెక్టు మొదటి దశ 2018 మార్చి నాటికి పూర్తి అవుతుందని ఆశించారు.[9]
  • 2016 జూన్ నాటికి 13.1 కిలోమీటర్ల మొదటి సొరంగం త్రవ్వకం పూర్తయినది. రెండవ సొరంగం త్రవ్వకం 10 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది.
  • 2017 డిసెంబరు నాటికి, 15.31 కిలోమీటర్ల మొదటి సొరంగం త్రవ్వకం పూర్తయినది. రెండవ సొరంగం త్రవ్వకం 10.8 కిలోమీటర్లు మాత్రమే పూర్తయినది.[10]
  • 2018 మార్చి నాటికి ముందు కొద్ది సంవత్సరాలుగా బిల్లుల చెల్లింపులలో సమస్యల కారణంగా ప్రాజెక్టు పనులు మందకొడిగా సాగాయి.[11]
  • పురోగతి లేని కారణంగా ఈ పనులు చేస్తున్న గుత్తేదారులను తొలగించి, 2018 మార్చిలో ప్రభుత్వం తిరిగి టెండర్లను ఆహ్వానించింది.

ప్రాజెక్టు నిర్వహణ లోపాలు

[మార్చు]

ఈ ప్రాజెక్టు జలయజ్ఞంలో భాగంగా తొలిదశలో నిర్వహించారు.2012 లో విడుదలైన కంప్ట్రోలర్, ఆడిట్ జనరల్ నివేదిక (2) ప్రకారం, ప్రజాపనుల నియమాలు పక్కన బెట్టి, గుత్తేదారులచేత వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక చేయించారు. దీనిలో అందుబాటులో వుండే మిగులు జలాలను సరిగా అంచనా వేయలేదు. నాలుగు నుండి ఐదు సంవత్సరాల వరకు పనులలో జాప్యం జరిగింది. కేంద్ర నీటి సంఘం అనుమతి పొందకుండానే ప్రాజెక్టు మొదలు పెట్టారు. దీనికి సంజాయిషీగా 2012 రాష్ట్రప్రభుత్వం మిగులు జలాల లభ్యత వుందని తెలిపింది ఇతర ప్రాజెక్టులపై ప్రభావం వుండదని తెలిపింది. వరదరోజుల లెక్కంపు సవరణల గురించి ఇచ్చిన సంజాయిషీలో 30 రోజుల వరదకాలంలో పొందే జలాలతోపాటు, మిగతా అవసరమైన జలాలను శ్రీశైలం, జూరాల జలాశయాలనుండి వాడుకుంటామని. దీనిని ఆంధ్రప్రదేశ్ పరిమితిలోగా వుండేటందుకు, గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు మళ్లించుతామని, ఇంకా పులిచింతల జలాశయం నిర్మిస్తామని తెలిపారు. అయితే తనిఖీ అధికారి, దీనిని ఒప్పుకోలేదు. కృష్ణా డెల్టా నీటి న్యాయసంస్థ-2 ఇచ్చిన తీర్పు ప్రకారం, ఆంధ్రప్రదేశ్ కు అందుబాటులో వుండే మిగులు జలాలు తగ్గుతాయని, వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలో వరద కాలం గురించి చర్చించలేదని, జూరాల నీటనిల్వ తక్కువైనందున, ఈ ప్రాజెక్టులకు అవసరమైన నీరు దాని ద్వారా పొందలేమని చెప్పారు. దీనికి బదులుగా, ప్రభుత్వం దుమ్ము గూడెం-నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ ద్వారా మరిన్ని గోదావరి నీళ్లు మళ్లించే ప్రాజెక్టు వుందని తెలియచేసింది. అయితే దీనికి వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక సిద్ధమవలేదు.[12]

నిర్వాసితులకు పరిహారం, పునరావాసం గురించి 2014 మార్చితో ముగిసిన సంవత్సరానికి ఆర్థిక రంగ తనిఖీలో భాగంగా ఈ క్రిందివాటిని పేర్కొంది. నిర్వాసం తగ్గించేందుకు ఈపిసి సంస్థలు సాగునీటి శాఖ అధికారులతో చర్చలు జరిపినట్లుదృష్టికిరాలేదు. పునరావాస పునర్నిర్మాణ కమీషనర్ ప్రకటనలో కంటే గెజిట్ ప్రకటనలో ఎక్కువ సంఖ్యలో ముంపు గ్రామాలు ప్రకటించారు. వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించి తొలుత 30 గ్రామాలు ప్రభావిత గ్రామాలుగా ప్రకటించగా 11 గ్రామాలకు మాత్రమే సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించినప్పటికీ ఆ పనిలో 45 నెలల జాప్యం జరిగింది. తొలుత నాలుగు గ్రామాలలో మాత్రమే సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించగా తరువాత తొలుత ప్రభావిత జాబితాలో లేని ఏడు గ్రామాలలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారు. సర్వే వివరాలను ప్రచురించడంలో 4-38 నెలల జాప్యం జరిగింది. సమగ్ర పునరావాస-పునర్నిర్మాణ నివేదిక అంటే పునరావాస కేంద్రాలకు భూసేకరణ, కేటాయింపు లాంటి వివరాలు లేవు. అందువలన కచ్చితమైన ఆర్థికభారం తెలియుటలేదు. ప్రాజెక్టు స్థాయి పరివీక్షణ సమావేశాలు మూడు నెలలకు ఒకసారి జరగవలసివున్నా జరగలేదు.[13]

2019-20 బడ్జెట్

[మార్చు]

2019-20 బడ్జెట్ లో వెలిగొండ సొరంగం 1 పూర్తిచేయటానికి పనులు, ఇతర పనులకు 485.10 కోట్లు ఖర్చుచేసి, సంవత్సరంలోపు పూర్తి చేసి 1.19 లక్ష ఎకరాలకు సాగునీరు అందచేస్తామని ప్రకటించారు.[14][15]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh / Ongole News : Project details". Irrigation dept, Govt. of A.P. Archived from the original on 2017-02-02. Retrieved 2018-05-28.
  2. "Andhra Pradesh / `Velugonda' to be named after Poola Subbaiah". The Hindu. 2005-08-01. Archived from the original on 2015-04-07. Retrieved 2018-05-28.
  3. "The Hindu: Work on Veligonda project resumes". TheHindu.com. 2013-03-25.
  4. "Double Shield bores Water Transfer Tunnel beneath Indian Tiger Sanctuary". Archived from the original on 2015-07-26.
  5. శివ రాచెర్ల. "వెలిగొండ ప్రాజెక్టు… 3 జిల్లాల కన్నీటిగాథ". Bharatvillages.com. Archived from the original on 2016-06-30.
  6. "వేగంగా వెలిగొండ పునరావాస కాలనీ పనులు". సాక్షి. Archived from the original on 2019-09-11.
  7. "నిర్వాసితుల 'వెలి'గొండ." ప్రజాశక్తి. 2016-09-20. Archived from the original on 2019-09-11.
  8. Surdarsana rao S. "2. Salient Features of Veligonda Irrigation project". Irrigation system impact assessment and command area management plan using remote sensing and insitu data (PDF). JNTU,Hyderabad.
  9. "1st Phase is expected to be complete by March 2018". thehansindia.com. 15 May 2015. Archived from the original on 2017-01-13.
  10. "అమరావతి : చురుగ్గా వెలిగొండ". ఆంధ్రప్రభ. Archived from the original on 2019-09-11.
  11. "నత్తనడకన వెలిగొండ". ఆంధ్రజ్యోతి. Archived from the original on 2017-01-10.
  12. Report of the CAG on Jalayagnam (Report No 2 of 2012) (PDF). CAG, Govt of India. 2012. p. 7-11.[permanent dead link]
  13. "ఎంపిక చేసిన భారీ నీటి పారుదల ప్రాజెక్టులలో పునరావాస పునర్నిర్మాణం అమలు". 2014 మార్చితో ముగిసి సంవత్సరానికి ఆర్ధిక రంగంపై భారత కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ నివేదిక ( 2015లో రెండవది) (PDF). CAG, Govt of India. 2015. p. 65-76.
  14. బుగ్గన రాజేంద్రనాథ్ (2019-07-13). Wikisource link to ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రసంగము 2019-20#veligonda. వికీసోర్స్. 
  15. "సాగునీటి ప్రాజెక్టులకు సాహో". 2019-07-13. Archived from the original on 2019-09-11.

బయటి లంకెలు

[మార్చు]