వికీపీడియా:వాడుకరి పేజీ

వికీపీడియా నుండి
(వికీపీడియా:సభ్యుని పేజీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

వాడుకరి పేజీలు వాడుకరి:, వాడుకరి చర్చ: పేరుబరుల్లో ఉండే పేజీలు. ఇవి, వికీపీడియాలో వాడుకరులు చేసే పనులకు సహాయకంగా ఉండే పేజీలు. వాడుకరులు వికీలో తాము చేసే పనుల విషయమై తోటివారితో చర్చలు జరిపేందుకు ఈ పేజీలు ఉపయోగపడతాయి. వాడుకరి పేజీలు ప్రధానంగా వ్యక్తుల మధ్య చర్చల కోసం, నోటీసుల కోసం, పరీక్షార్థం, చిత్తుప్రతి వ్యాసాల కోసం ఉపయోగపడతాయి. అలాగే వాడుకరికి ఇష్టమైతే పరిమితంగా తన స్వవిషయాలు రాసుకోవచ్చు.

వాడుకరి స్థలం

[మార్చు]

వాడుకరుల మధ్య సంప్రదింపులు జరుపుకునే వీలు కలిగించేందుకు వికీపీడియాలో వాడుకరి పేజీలు ఉపయోగ పడతాయి. మీ వాడుకరి పేరు ఫలానారావు అయితే:

  • మీ వాడుకరి పేజీ వాడుకరి:ఫలానారావు అవుతుంది. మీకిష్టమైతే మీ గురించి, వికీపీడియాలో మీరు చేస్తున్న పనుల గురించిన సమాచారాన్ని ఇందులో ఇవ్వవచ్చు. ఇక్కడ సమాచారమేమీ పెట్టడం మీకిష్టం లేకపోతే, దీన్ని మీ వాడుకరి చర్చ పేజీకి దారిమార్పు చెయ్యవచ్చు. మరొక పద్ధతి ఏంటంటే ఆ పేజీని ఖాళీగా వదిలెయ్యడం. కానీ, అలా వదిలేసినపుడు, మీ వాడుకరిపేరుకు ఉండే లింకు ఎర్రగా కనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక పద్ధతి ఉంది: మెటా-వికీ సైటులో ఒక సార్వత్రిక వాడుకరిపేజీని తయారు చేసుకోవడం. దీంతో, వికీమీడియా ప్రాజెక్టుల్లో ఎక్కడెక్కడ మీకు స్థానిక వాడుకరి పేజీ లేదో, అక్కడక్కడ ఈ సార్వత్రిక వాడుకరి పేజీ కనిపిస్తుంది.
  • మీ వాడుకరి చర్చాపేజీ వాడుకరి చర్చ:ఫలానారావు వద్ద ఉంటుంది. ఇతర వాడుకరులు మీతో చర్చించే పేజీ ఇది.
  • మీ వాడుకరి ఉప పేజీలు వాడుకరి:ఫలానారావు/మొదటిది లేదా వాడుకరి చర్చ:ఫలానారావు/మొదటిది. ప్రయోగశాలలు, పరీక్షాత్మక పేజీలు వంటి పేజీలను మీ వాడుకరి పేజీకి అనుబంధంగా ఉప పేజీలుగా తయారు చేసుకోవచ్చు.
  • పైపేజీలన్నిటినీ కలిపి మీ వాడుకరి స్థలం అంటారు.

మీ వ్యక్తిగత వివరాలు వాడుకరి పేజీ లోనే ఉండాలి గానీ, ప్రధాన నేమ్ స్పేసులోని పేజీల్లో రాయకూడదు.

నా వాడుకరి పేజీలో ఏమేమి పెట్టుకోవచ్చు?

[మార్చు]

సభ్యతకు లోబడి, మీ ఇష్టమొచ్చింది పెట్టుకోవచ్చు.

  • మీ గురించి కొంత పెట్టుకోండి - మీ ఫోటో, ఈమెయిలు, అసలు పేరు, మీ సొంత ఊరు, మీ ఆసక్తులు, మీ వృత్తి, ఇలాంటివి. వేటిని బయట పెట్టాలి, వేటిని దాచాలి అనేది మీ ఇష్టమనుకోండి.
  • వికీపీడియాలో మీరు చెయ్యదలచిన పనులు, చేస్తున్న పనులు, పనికొచ్చే లింకులు మొదలైనవి కూడా పెట్టుకోవచ్చు. మీ స్వంత ప్రయోగశాలలో వికీమార్కప్‌తో ప్రయోగాలు కూడా చేసుకోవచ్చు.
  • కొంతకాలం పాటు వికీలో పని చెయ్యని పక్షంలో మీ వాడుకరి పేజీలో చిన్న నోటు పెట్టండి.
  • ఏదన్నా బొమ్మనో, ఓ సూక్తినో, మీకిష్టమైన వికీపీడియా వ్యాసపు లింకునో కూడా పెట్టుకోవచ్చు. వికీపీడియాలో మీరు చేసిన కృషికి గుర్తింపుగా ఎవరైనా మీకు బార్న్ స్టారును బహూకరించవచ్చు. దాన్ని మీ వాడుకరి పేజీలో పెట్టుకోండి.
  • మీ రచనలను సార్వజనికం చేస్తూ లైసెన్సు విడుదల చెయ్యదలచినా, మీ వాడుకరి పేజీలో చెయ్యవచ్చు.

ఇతరుల వాడుకరి పేజీలో దిద్దుబాట్లు చెయ్యకండి. అయితే టైపింగు తప్పులు, భాషాదోషాలు లాంటివి కనిపిస్తే, చొరవగా సరిదిద్దండి. తమ వాడుకరి పేజీలో దిద్దుబాట్లు జరిపితే కొందరు వాడుకరులు ఏమీ అనుకోరు గానీ, కొందరు ఇష్టపడక పోవచ్చు. ఉత్తమమైన మార్గం ఏమిటంటే.. మీకు కనిపించిన సవరణలను సదరు వాడుకరి చర్చాపేజీలో సూచించండి.

  • వికీపీడియాకు సంబంధం లేని విషయాలను మరీ ఎక్కువగా వాడుకరి పేజీలో పెట్టకండి. మీ వాడుకరి పేజీ మీ స్వంత హోమ్ పేజీ కాదు, అది ఓ వికీపీడియనుగా మీ పేజీ మాత్రమే.
  • ఉచితంగా, స్వేచ్ఛగా దొరకని బొమ్మలను మీ వాడుకరి పేజీలో పెట్టకండి. అలాంటి బొమ్మలు కనిపిస్తే వెంటనే తీసివెయ్యబడతాయి.

మీ పేజీని వికీపీడియను వర్గాలలోకి చేర్చుకోవచ్చు.

వాడుకరి ఉప పేజీల సంగతేమిటి?

[మార్చు]

మీకు ఇంకా కొన్ని పేజీలు కావాలనుకుంటే ఉపపేజీలను సృష్టించుకోవచ్చు. మీ వాడుకరి పేజీలో ఏది ఉండాలని కోరుకుంటారో వాటన్నిటినీ ఇక్కడా పెట్టుకోవచ్చు.

ఉదాహరణలు:

  • మీరు ఏదైనా వ్యాసం రాస్తూంటే అది ఒక స్థాయికి వచ్చేదాకా ఇక్కడ పెట్టి, రాసుకోవచ్చు
  • మీ పాత చర్చాపేజీలను ఇక్కడ నిక్షిప్తం చేసుకోవచ్చు
  • ప్రయోగాలు: ఏదైనా మూసపై ప్రయోగాలు చెయ్యదలిస్తే దాన్నో ఉపపేజీగా చేసి, ప్రయోగాలు చెయ్యండి

ఏవి వర్జితం?

[మార్చు]

వికీపీడియాకు సంబంధం లేని విషయం మరీ ఎక్కువ పెట్టరాదు. ఉదాహరణకు:

  • మీ వికీపీడియాయేతర పనుల గురించిన బ్లాగు
  • వికీపీడియాకు సంబంధం లేని విషయంపై చర్చ
  • మితి మీరిన వ్యక్తిగత సమాచారం
  • వికీపీడియాకు సంబంధం లేని ఉపాఖ్యానాలు, వ్యాఖ్యలు
  • వినోదం, కాలక్షేపం కబుర్లు, ముఖ్యంగా వికీపీడియాలో చురుగ్గా పాల్గొనని వాడుకరుల విషయంలో మరీను
  • వికీపీడియాలో పాల్గొనని వారితో చర్చ
ఇంకా చూడండి: వికీపీడియా:ఏది వికీపీడియా కాదు

ఉచిత హోస్టింగు, ఈమెయిలు సదుపాయాలు అందించే సైట్లు బోలెడన్ని ఉన్నాయి. అలాంటి వాటి కోసం వికీపీడియా కంటే ఆ సైట్లు మేలు.

వికీపీడియాలో చురుగ్గా పాల్గొనే వారి విషయంలో ఈ మార్గదర్శకాలను అమలు చెయ్యడంలో వికీపీడియా సముదాయం కొంత సహనంతో ఉంటుంది. మంచి దిద్దుబాటు చరిత్ర కలిగిన వికీపీడియనుల విషయంలో వికీపీడియాకు అంతగా సంబంధం లేని సామాజిక కార్యక్రమాలను కూడా అనుమతిస్తుంది.

మీ వాడుకరి పేజీని మరో పేజీకి దారిమార్పు చెయ్యడం (చర్చాపేజీకి, ఉపపేజీలకు కాకుండా) కొందరికి కోపం తెప్పిస్తుంది. దీని వలన మీకు సందేశాలు రాయాలన్నా, మీ రచనల గురించి చూడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. మీ పాత ఖాతాకు సంబంధించిన వాడుకరి పేజీ నుండి కొత్త ఖాతా యొక్క వాడుకరి పేజీకి చేసిన దారిమార్పు దీనికి మినహాయింపు.

వాడుకరి పేజీల స్వంతదార్లు, దిద్దుబాట్లు

[మార్చు]

వాడుకరులు తమ వాడుకరి పేజీలను తమ ఇచ్చ వచ్చినట్లుగా పెట్టుకోవడం అనూచానంగా వస్తోంది. అయినప్పటికీ, ఈ పేజీలు సముదాయానికి చెందినవే:

  • ఇక్కడి రచనలు, వికీపీడియా వ్యాసాల్లాగే GFDL లైసెన్సుకు అనుగుణంగా ఉండాలి.
  • మీ పేజీలలో ఇతర వాడుకరులు దిద్దుబాట్లు చెయ్యవచ్చు. కానీ మీ వాడుకరి పేజీలో ఇతరులు దిద్దుబాటు చెయ్యకపోవడం ఓ సాంప్రదాయంగా వస్తోంది.
  • సముదాయపు విధానాలు, వ్యక్తిగత దాడులతో సహా అన్నీ, మిగతా చోట్ల లాగే ఇక్కడా అమలవుతాయి.
  • కొన్ని సందర్భాల్లో, వికీపీడియాకు ఏ విధంగానూ ఉపయోగపడని విషయాలను తీసివెయ్యవలసి ఉంటుంది.

వికీపీడియాలో పెట్టేందుకు ఉచితంగా ఉండనివి, ఇతరులు దిద్దుబాటు చెయ్యరాదు అని మీకనిపించినవీ అయిన విషయాలను మీ స్వంత వెబ్ సైటులో పెట్టుకోండి. ఉచితంగానూ, తక్కువ ఖర్చుతోను వెబ్ హోస్టింగు చేసే చాలా సంస్థలున్నాయి.

వాడుకరి పేజీల సంరక్షణ

[మార్చు]

వ్యాసాల పేజీల్లాగానే, వాడుకరి పేజీలు కూడా దుశ్చర్యలకు గురవుతూ ఉంటాయి. దుశ్చర్యలు కొనసాగుతూ ఉంటే, పేజీని సంరక్షించవలసి రావచ్చు. సంరక్షించిన పేజీ పేరును, సంరక్షణ కారణంతో సహా వికీపీడియా:సంరక్షిత పేజీ పేజీలో చేర్చాలి.

ఈ వాడుకరి పేజీ దుశ్చర్యలు, సాధారణంగా దుశ్చర్యలపై నిర్వాహకులు తీసుకున్న చర్యలకు ప్రతీకారంగా జరుగుతాయి. అవసరమనిపించినపుడు నిర్వాహకులు తమ వాడుకరుల పేజీలను సంరక్షించుకోవచ్చు. కొన్ని అరుదైన సందర్భాల్లో నిర్వాహకుడు కాని వాడుకరుల పేజీలు కూడా దుశ్చర్యకు గురి కావచ్చు. అలాంటి వారు వికీపీడియా:సంరక్షణ కొరకు అభ్యర్ధన పేజీలో సంరక్షణ కోరుతూ అభ్యర్ధన పెట్టవచ్చు. అప్పుడు నిర్వాహకులు దాన్ని సంరక్షిస్తారు.

చర్చాపేజీల్లో దుశ్చర్య కాస్త తక్కువగానే ఉంటుంది. అలాంటిది జరిగితే, దాన్ని వెనక్కి తీసుకుపోవడంతో సరిపెట్టాలి. పదేపదే జరిగిన దుశ్చర్యల విషయంలో విధానాలు అనుమతించిన మేరకు నిరోధాన్ని విధించి దుశ్చర్యను అరికట్టాలి. చాలా అరుదుగా సంరక్షణ విధించవలసి రావచ్చు. కానీ, చర్చాపేజీకి ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా, అది చిట్టచివరి వికల్పం కావాలి.

ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాడుకరుల పేజీల సంరక్షణను ఎత్తివేయాలి.

తొలగింపు

[మార్చు]

మీ పేజీలోని విషయాలను తొలగించాలని సముదాయం అభిప్రాయపడితే, మీరు సదరు సమాచారాన్ని తొలగించాలి. సముదాయపు సమ్మతితోనే మీరు ఆ విషయాలను పెట్టుకోవచ్చు. ఓ సంవత్సరం పైగా వికీపీడియాలో చురుగ్గా ఉంటూ అనేక మంచి వ్యాసాలకు తోడ్పాటు అందించిన వాడుకరుల విషయంలో సముదాయం కాస్త మెత్తగా ఉండే అవకాశం ఉంది.

మీరు సహకరించకపోతే, మేమే సదరు పేజీలో దిద్దుబాటు చేసి అనుచితమైన విషయాలను తొలగిస్తాం. ఒకవేళ పేజీ యావత్తూ అనుచితమైతే, ఆ పేజీని మీ ప్రధాన వాడుకరి పేజీకి దారిమార్పు చేస్తాం.

మరీ మితిమీరిన సందర్భాల్లో సదరు వాడుకరి ఉపపేజీని తొలగింపు విధానాలకు అనుగుణంగా తొలగిస్తాం. అలా తొలగించిన పేజీని మళ్ళీ సృష్టించకండి. మళ్ళీ వెంటనే తొలగించేందుకు అది చాలు. ఉచితానుచితాల విషయంలో మా నిర్ణయాన్ని గౌరవించండి.

నా ఉపపేజీలను తొలగించడం ఎలా?

[మార్చు]

{{delete}} అనే మూసను సదరు ఉపపేజీలో చేర్చడం ద్వారా మీ వాడుకరి ఉపపేజీని తొలగించుకోవచ్చు.

లేదా, ఆ పేజీని మీ వాడుకరి పేజీకి దారిమార్పు పేజీగా మార్చి వేస్తే సరి! చాలా వరకు ఇది సరిపోతుంది.

పై మూసను మీ పేజీలను తొలగించేందుకు మాత్రమే వాడండి, అదీ బలమైన కారణం ఉంటేనే.

ఆ పేజీ గతంలో వేరే నేమ్ స్పేసులో ఉండి, వాడుకరి ఉపపేజీగా తరలించబడి ఉంటే, ఈ తొలగింపు జరగదు. వీటిని తొలగింపు కొరకు వ్యాసాలు పేజీలో చర్చించాక మాత్రమే తొలగిస్తారు.

నా వాడుకరి పేజీ, చర్చాపేజీలను తొలగించడం ఎలా?

[మార్చు]

దుశ్చర్యలేమీ లేనపుడు, వ్యక్తిగత సమాచారం వికీపీడియాకు అవసరంలేని సందర్భాల్లో, మీ వాడుకరి పేజీ, చర్చాపేజీలను తొలగించమని కోరవచ్చు. చాలాకాలంగా సభ్యుడై ఉన్న వారు వికీపీడియాను వీడిపోదలచినపుడు అలా అడగవచ్చు.

తొలగింపు కొరకు మీ పేజీలో అభ్యర్ధన పెట్టండి. నిర్వాహకులెవరైనా ఆ పేజీని చూసి, తొలగింపు వికీపీడియా విధానాలకు అనుగుణంగా ఉన్నదనుకుంటే తొలగిస్తారు. తొలగించిన వాడుకరి పేజీల స్థానంలో ఖాళీ పేజీ ఒకదాన్ని సృష్టించి పెడితే, సదరు పేజీకి గతంలో ఇచ్చి ఉన్న లింకులు ఎర్ర లింకులుగా మారకుండా చూడవచ్చు.

నా వాడుకరి పేజీ నుండి ఇతరులకు ఇంకా ఏం సమాచారం అందుబాటులో ఉంటుంది?

[మార్చు]

మామూలు వ్యాసాల పేజీల్లో ఉన్నట్లే, "పేజీ చరితం", "చర్చ" వంటి లింకులు ఉంటాయి. ఎడమ పక్కన ఉండే లింకుల్లో "వాడుకరి రచనలు" అనే లింకు నొక్కి సదరు వాడుకరి చేసిన దిద్దుబాట్ల జాబితా చూడొచ్చు.

అలాగే "ఈ వాడుకరికి ఈమెయిలు పంపు" అనే లింకు ద్వారా, సదరు వాడుకరికి ఈమెయిలు పంపవచ్చు.