Jump to content

నామవాచకం (తెలుగు వ్యాకరణం)

వికీపీడియా నుండి
(నామవాచకము నుండి దారిమార్పు చెందింది)

ఒక వాక్యాన్ని కొన్ని భాగాలుగా విడగొట్టి పరిశీలించవచ్చు. ఇలా విడగొట్టిన భాగాలకి ప్రత్యేకమైన పేర్లు ఉన్నాయి. ఇటువంటి భాషాభాగాల పేర్లలో ముఖ్యమైనవి: నామవాచకం (noun), సర్వనామం (pronoun), విశేషణం (adjective), క్రియ (verb), విభక్తి ప్రత్యయం (post position). ఈ భాగంలో ప్రస్తావన నామవాచకం గురించి మాత్రమే.

నిర్వచనం

[మార్చు]

ఒక వ్యక్తిని కాని, ఒక స్థలాన్ని కాని, ఒక వస్తువుని కాని, ఒక ఊహని కాని సూచించేది నామవాచకం.

వచనం

[మార్చు]
  • తెలుగులో తారసపడే నామవాచకాలకి, సర్వసాధారణంగా, "వచనం" (number), "లింగం" (gender) ఉంటాయి.
  • మనుష్యులలో మగ వారిని సూచించేది పుంల్లింగం లేదా పురుష లింగం
    • రాముడు, తాత, ఎరకయ్య, పిల్లడు, మొ.
  • మనుష్యులలో ఆడ వారిని సూచించేది స్త్రీ లింగం.
    • సీత, మామ్మ, రత్తాలు, పిల్ల, మొ.
  • పశువులు, చెట్లు, ప్రాణం లేని పదార్థాలు, అన్నీ కూడా స్త్రీ లింగమే
    • ఆవు, గంట, అడవి, మొ.
  • నామవాచకాలు "ఏకవచనం" (singular) లోనయినా ఉంటాయి, "బహువచనం" (plural) లోనయినా ఉంటాయి.
  • బహువచనంలో ఉన్న మాటలు, సర్వసాధారణంగా, "లు"తో కాని "ళ్లు"తో కాని అంతం అవుతాయి.
    • ఏకవచనంలో ఉన్న కొన్ని నామవాచకాలకి కేవలం "లు" తగిలిస్తే బహువచనాలు అవుతాయి.:
      • గోడ --> గోడలు
      • చేప --> చేపలు
      • మాట --> మాటలు
      • పన్ను ---> పన్నులు (tax-->taxes)
    • సంస్కృతం నుండి తెలుగు లోకి వచ్చినప్పుడు ఏకవచనంలో "డు" సంతరించుకున్న మాటలు బహువచనంలో "డు"ని పోగొట్టుకుని "లు" చేర్చుకుంటాయి:
      • పండితుడు --> పండితులు
      • స్నేహితుడు --> స్నేహితులు
      • ఆత్మీయుడు --> ఆత్మీయులు
    • బహువచనంలో "లు" చేర్చినప్పుడు, అప్పుడప్పుడు, సంధి చేయవలసి వస్తుంది:
      • పేరు --> పేరులు --> పేర్లు
      • కారు --> కారులు --> కార్లు
      • బోటు --> బోటులు --> బోట్లు
      • చెట్టు --> చెట్టులు --> చెట్లు
      • మెట్టు --> మెట్టులు --> మెట్లు
      • రోడ్డు --> రోడ్డులు --> రోడ్లు
    • ఏకవచనంలో ఉన్న నామవాచకం "లు"తో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
      • కీలు --> కీళ్లు
      • తేలు --> తేళ్లు
      • కాలు --> కాళ్లు
      • పాలు --> పాళ్లు (portion -->portions)
      • పెనిసిలు --> పెనిసిళ్లు (pencils)
    • ఏకవచనం "డి", "డు", "లి", "రు" లతో అంతం అయితే దాని బహువచనం "ళ్లు"తో అంతం అవుతుంది:
      • బడి --> బళ్లు (schools)
      • బండి --> బళ్లు (carts)
      • పెరడు --> పెరళ్లు (backyards)
      • ఊరు --> ఊళ్లు (villages)
    • కొన్ని నామవాచకాలకి "లు" తగిలించినప్పుడు మాట వర్ణక్రమంలో కొద్ది మార్పు వస్తుంది.
      • నది --> నదులు
      • గది --> గదులు
      • బంతి --> బంతులు
    • ప్రత్యేకమైన సందర్భాలు
      • మడి --> మళ్లు
      • గడి --> గళ్లు
      • సుడి --> సుళ్లు
      • పండు --> పండ్లు, పళ్లు (fruits)
      • పన్ను ---> పళ్లు (tooth-->teeth)
      • ఇల్లు --> ఇళ్లు
      • ఎద్దు --> ఎడ్లు
    • కొన్ని నామవాచకాలు ఎల్లప్పుడూ బహువచనాలే!
      • పాలు, నీళ్లు

లింగం

[మార్చు]
  • సర్వసాధారణంగా "డు"తో అంతం అయ్యే పేర్లు అన్నీ పుంల్లింగమే అవుతాయి.
    • రాముడు, తమ్ముడు, అల్లుడు, మనుమడు, ముఖ్యుడు, మొ.
  • పుంల్లింగములు అన్నీ "డు"తో అంతం అవ్వాలని నియమం ఏదీ లేదు
    • తండ్రి, అన్న, మామ, మొ.
    • జంతువులు అన్నీ స్త్రీ లింగములే.
      • ఆవు, ఎద్దు, మగ గుర్రం, ఆడ గుర్రం, మొసలి, మొ.
    • ప్రాణము లేనివి అన్నీ స్త్రీ లింగములే
      • చెట్టు, నది, రాయి, మొ.
    • కొన్ని వర్గాలలో ఆడ, మగ, వ్యత్యాసం చూపించడానికి వేర్వేరు పేర్లు ఉన్నాయి:
      • అమ్మ, అత్త, అక్క, కోడలు, అమ్మాయి, పిల్ల, మొ. స్త్రీ లింగములు
      • నాన్న, మామ, అన్న, అల్లుడు, అబ్బాయి, పిల్లడు, మొ. పుంల్లింగములు

లింగం మార్పిడి

[మార్చు]
  • పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-ఉడు" సబ్దాన్ని తీసేసి "-టి"ని చేర్చాలి.
      • నటుడు --> నటి
      • వంచకుడు --> వంచకి
  • పుంల్లింగం మాటని స్త్రీ లింగంలోకి మార్చాలంటే మాట చివర "-డు" సబ్దాన్ని తీసేసి "-రాలు"ని చేర్చాలి.
      • వంచకుడు --> వంచకురాలు
      • ప్రియుడు --> ప్రియురాలు
      • భక్తుడు --> భక్తురాలు
      • స్నేహితుడు --> స్నేహితురాలు
  • కొన్ని మాటలు ఎల్లప్పుడు స్త్రీ లింగాలే
      • చూలాలు, ఇల్లాలు