Jump to content

నాటక పరిషత్తు

వికీపీడియా నుండి
(నాటక పరిషత్తులు నుండి దారిమార్పు చెందింది)
ఆంధ్ర నాటక కళాపరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, 1929

నాటక రంగంలో నాటక పోటీలు నిర్వహించే సంస్థలే నాటక పరిషత్తులు. ఈ నాటక పరిషత్తులు వివిధ నాటికలు, నాటకాల పోటీలను నిర్వహిస్తూ, నాటక సమాజాల మధ్యన స్పర్ధకు, తద్వారా నాటకరంగ అభ్యున్నతికీ పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు, పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి. ఈ పరిషత్తు పోటీల్లో ప్రదర్శించే నాటకాలను పరిషత్తు నాటకాలు అంటారు. తెలుగు ప్రాంతాల్లోని పలు పరిషత్తులు వార్షికంగా పాక్షికంగా వృత్తిపరమైన స్థాయి లోను, ఔత్సాహిక స్థాయి లోనూ ఉన్న నాటక సమాజాలకు నిర్వహించే నాటక పోటీల సూత్రాలపై ఆధారపడి ఈ నాటకాలు రూపుదిద్దుకుంటాయి. 1944లో ఆంధ్ర నాటక కళా పరిషత్తు ఈ తరహా పరిషత్తు పోటీలకు నాంది పలికింది.

చరిత్ర

[మార్చు]

1944లో ఆంధ్ర నాటకకళా పరిషత్తు నాటకాలకు పోటీలు ఏర్పాటుచేయడంతో పరిషత్తు నాటకాలు ప్రారంభమయ్యాయి. ఆంధ్ర నాటకకళా పరిషత్తు పద్య నాటకాల ఆధిపత్యాన్ని తగ్గించి, వాస్తవిక వాతావరణంలో నిజజీవిత సమస్యలను చిత్రీకరించే సాంఘిక నాటకాలు పెంచాలన్న లక్ష్యంతో ఈ పోటీలను ప్రారంభించింది. ఆ పోటీల్లో పాలుపంచుకునే నాటకాలకు పరిషత్తు విధించిన నిబంధనల్లో ముఖ్యమైనవి-సమకాలీనమైన సాంఘిక, సాంస్కృతిక జీవనాన్ని ప్రతిబింబించాలి, నాటకాల్లో పద్యాలు, పాటలు, సంగీతానికి నాట్యం చేయడం వంటివి లేకుండా ఉండాలి, స్త్రీలే స్త్రీపాత్రలు ధరించాలి. ఈ నిబంధనలు అప్పటి నాటకరంగ స్థితిగతులకు విప్లవాత్మకమయ్యాయి. అలా ప్రారంభమైన ఈ నాటకాలు, క్రమంగా రకరకాల పరిషత్తులు, పోటీలు పెరిగిపోయి తుదకు పరిషత్తు నాటకాలనే కొత్తరకం నాటకాలకు రూపాన్నిచ్చాయి.

1960ల్లో ఆంధ్ర నాటకకళా పరిషత్తు వ్యవస్థాపక సభ్యులు, ఇతర ముఖ్యులు పదవుల నుంచి విశ్రాంతి, విరమణలు తీసుకుంటూండడంతో సంస్థ నిర్వహణ విషయంలో విశ్వనీయత, సమర్థత లోపించింది. తద్వారా నాటి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలలో కొత్తగా పరిషత్తులు ఏర్పాటై, నాటకపోటీలు ప్రారంభించడం మొదలైంది.

ఈ పరిషత్తు పోటీల వల్ల నాటకాల ఇతివృత్తాల నుంచి సెట్ ప్రాపర్టీల వరకూ అన్నిటిలోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త నటీనటులు, రచయితలు నాటకరంగానికి వచ్చి చేరారు. కొత్త అభిరుచులతో, కొత్తరకం ప్రేక్షకులు కూడా నాటకాలకు అలవాటుపడ్డారు. ఇలా 1940ల నుంచి 1970 దశకం వరకూ ప్రతి అంశంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ నాటకాలు, ప్రదర్శనలు, కళాకారులు, రచయితలు వగైరా అన్ని విధాలా పరిషత్ నాటకాలకు స్వర్ణయుగంగా పేరుగడించింది.[1]

పోటీల నిర్వహణ పద్ధతులు

[మార్చు]

సాధారణంగా పరిషత్తు నాటక పోటీలు నాలుగు నుంచి వారం రోజుల పాటు జరుగుతూంటాయి. పరిషత్తు నాటకాల నిర్వహణలో రెండు భాగాలు ఉంటాయి-నాటకాల ఎంపిక, పోటీ నిర్వహణ.

ఎంపిక విధానాలు

[మార్చు]

స్క్రూటినీ విధానం

[మార్చు]

పరిషత్తు నిర్ణయించుకున్న పోటీల తేదీని ముందుగా ప్రకటించి, తమ పోటీల్లో పాల్గొనేందుకు నాటకసంఘాలు, నాటక సమూహాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ప్రదర్శించేందుకు ఆసక్తి చూపే సంస్థల నుంచి స్క్రిప్టులు అందుకున్నాకా, నాటకరంగంలో నిపుణులతో ఓ జట్టు ఏర్పరుస్తారు. ఆ జట్టు దరఖాస్తు చేసుకున్న నాటక సంస్థల ప్రాంతాలకు వెళ్ళి అక్కడ రిహార్సల్స్ నీ, నాటక ఇతివృత్తాన్ని నాణ్యత, ఏర్పరిచన నిబంధనల మేరకు పరిశీలిస్తారు. అనంతరం వాటిలో పన్నెండు నుంచి ఇరవై వరకు నాటకాలను పోటీకి వారు నిర్వహిస్తారు.[2] ఈ పర్యటన, ఎంపిక విధానానికి స్క్రూటినీ అని, నిపుణుల జట్టుకు స్క్రూటినీ జడ్జిలు అని పరిషత్ వర్గాల్లో వాడుక. [1]

ఆహ్వాన ప్రదర్శనల పద్ధతి

[మార్చు]

ఆహ్వాన ప్రదర్శనల పద్ధతి ప్రకారం దరఖాస్తుల ఆహ్వానం, స్క్రూటినీ వంటివి ఉండవు. దానికి బదులు నిర్వాహకులే పేరొందిన కొన్ని నాటక సంస్థల నుంచి నాటకాలను ఎంపిక చేసి వాటిని ప్రదర్శనకు ఆహ్వానిస్తారు. ఐతే ఈ స్క్రూటినీ విధానం వల్ల రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రదేశాలకు స్క్రూటినీ జట్టును పంపాల్సిరావడం, వారి ప్రయాణఖర్చులు, అందుకు వ్యయమయ్యే కాలం వంటివన్నీ అదనపు భారంగా తోచడంతో పరిషత్తుల్లో ఆహ్వాన పోటీలను ప్రారంభించారు.[1]

పోటీ నిర్వహణ

[మార్చు]

పోటీకి ఎంపిక చేసే నాటకాలు సాధారణంగా పన్నెండు వరకూ ఉంటాయి. దాదాపుగా నాలుగు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఈ పోటీలు జరుగుతాయి. పోటీలో తుది ప్రదర్శన సమయంలో ముగ్గురు నుంచి ఐదుగురు సభ్యులున్న జడ్జిల ప్యానెల్ పరిశీలించి, మార్కులు ఇస్తుంది. "ఉత్తమ రచన", "ఉత్తమ నటుడు", "ఉత్తమ నటి", "ఉత్తమ దర్శకత్వం" వంటి విభాగాల్లోనూ, మొత్తంగా ఉత్తమ ప్రదర్శన విభాగాల్లో రెండు, మూడు బహుమతులు ఇస్తూంటారు. సాధారణంగా 4,5 రోజుల పాటు మూడు, నాలుగు నాటకాలు ప్రదర్శించేవారు. రోజూ నాలుగైదు గంటల పాటు నాటక పదర్శనలు జరుగతూంటాయి.[1]

నిర్మాణం

[మార్చు]

పరిషత్ నాటకాలలో ప్రధానంగా సాంఘిక నాటకాలే ఉంటూంటాయి. చాలా నాటక సంస్థలు తమ కోసం ప్రత్యేకించి కొత్త నాటకాన్ని రాయించుకుంటూంటారు. కొన్ని నాటక పరిషత్తులు ప్రత్యేకించి ఇతర పోటీల్లో ప్రదర్శింపబడని కొత్త నాటకాలే అర్హమంటూ నిబంధనలూ విధిస్తున్నాయి.[2] ఏదేమైనా చాలా అంశాలు ఆయా నాటకపోటీలోని నిబంధనలు అనుసరించే ఉంటాయి. రచయిత నాటకాన్ని రాసి ఇవ్వడం కాకుండా, దర్శకులు తమకు కావాల్సిన పద్ధతుల్లో నాటకాలు రాయించుకోవడం కూడా జరుగుతోంది.[3]

నాటక పరిషత్తు

[మార్చు]

ఆంధ్ర నాటక కళా పరిషత్తు తో పాటుగా రాష్ట్రం లో ఇంకా కొన్ని నాటక పరిషత్తులు ఏర్పాటై, నాటికలు , నాటకాల పోటీలను నిర్వహిస్తూ ,సమాజాల మధ్యన స్పర్ధకూ తద్వారా నాటకరంగ అభ్యున్నతికి పాటుపడుతున్నాయి. ఈ పరిషత్తులు, పోటీల కారణంగా ఎన్నో ఔత్సాహిక సమాజాలు కొత్త కొత్త నాటకాలు ప్రతియేటా తయారు చేస్తున్నాయి. ఒకనాడు వందల సంఖ్యలో ఉన్న పరిషత్తులు క్రమేణా పదుల సంఖ్యకు తగ్గిపోయాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 పెద్ది, రామారావు. "బేస్ లైన్ స్టడీ ఆన్ పరిషత్ నాటకం" (PDF). srtt.org (in ఆంగ్లం). Retrieved 16 October 2015.{{cite web}}: CS1 maint: unrecognized language (link)[permanent dead link]
  2. 2.0 2.1 మురళి. "పరిషత్తులు". నెమలికన్ను. Archived from the original on 7 మార్చి 2016. Retrieved 16 October 2015.
  3. పెద్ది, రామారావు. "అడాప్టేషన్ ఆఫ్ లిటరేచర్ ఫర్ థియేటర్". రామారావు పెద్ది, ఎస్సేస్ & మోర్. హైదరాబాద్. Archived from the original on 6 మార్చి 2016. Retrieved 16 October 2015. కేంద్ర సాహిత్య అకాడమీ వారు హైదరాబాదు లో నిర్వహించిన నాటక సదస్సుకోసం వ్రాసిన పత్రం