ఖడ్గతిక్కన

వికీపీడియా నుండి
(ఖడ్గ తిక్కన నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

క్రీస్తుశకం 13వ శతాబ్ధానికి చెందిన వీరుడు ఖడ్గతిక్కన లేదా రణ తిక్కన. ఈయన తిక్కన సోమయాజి పెద తండ్రి అయిన సిద్ధన మంత్రి కుమారుడు[1]. తల్లి పోతాంబ. ఖడ్గ తిక్కన 1190లో జన్మించాడని ఆరుద్ర చారిత్రక, సాహితీ ఆధారలను పరిశీలించి నిర్ణయించాడు. తనకు 70యేళ్ల దాకా అంటే 1260దాకా మనుమసిద్ధి కొలువులో ఉన్నాడని తేలింది. చాలామంది చరిత్రకారులు ఖడ్గతిక్కన 1260లో కాటమరాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడని చెబుతున్నారు అయితే దీనిలో చారిత్రక సత్యంపై ఆరుద్ర సందేహాలు వ్యక్తపరిచాడు.[2]

కుటుంబం

[మార్చు]

కేతన రచించిన దశకుమార చరిత్రలో ఖడ్గ తిక్కన వంశాన్ని చాలా వివరంగా వర్ణించాడు. ఖడ్గ తిక్కన ఇంటిపేరు కొట్టరువు. ఖడ్గ తిక్కన తాత అయిన భాస్కరమంత్రికి నలుగురు కుమారులు: పెద్దవాడు కేతనప్రగ్గడు, రెండవవాడు మల్లన, మూడవవాడు సిద్ధన, చివరి వాడు కొమ్మన. తిక్కన సోమయాజి తండ్రి కొమ్మన. ఖడ్గతిక్కన తండ్రి సిద్ధన చోడ తిక్కరాజుకు మంత్రిగా పనిచేశాడు. సిద్ధనమంత్రికి ఏడుగురు కుమారులు: ఖడ్గతిక్కన, భాస్కరుడు, కేతన, మల్లన, మల్లన, చిన భాస్కరుడు, పెమ్మన. వీరందరూ నెల్లూరి చోడుల ఆస్థానములో పనిచేసినవారే.[3]

ఖడ్గ తిక్కన భార్య జానమ్మ. వీరికి సిద్ధన, కొమ్మన, ఇమ్మడిమనుమసిద్ధి, ముమ్మడి మనుమసిద్ధి అని నలుగురు కుమారులు.[4]

యుద్ధం

[మార్చు]

నెల్లూరు తెలుగు చోళ వంశపు పాలకుడు రెండవ మనుమసిద్ధి[1][5]/మూడవ మనుమసిద్ది[1][6] కి, ఆయన సామంతుడు, కనిగిరి సీమలోని ఎర్రగడ్డపాడు యాదవరాజైన కాటమరాజుకు పుల్లరి విషయమై వైరం వస్తుంది. అది చివరకు యుద్ధానికి దారితీస్తుంది. మనుమసిద్దిరాజు మంత్రి, తన సర్వసైన్యాధక్షుడైన ఖడ్గతిక్కనను కాటమరాజుపై యుద్ధానికి సైన్యంతో సహా పంపాడు. సా.శ. 1260 ప్రాంతాల్లో ఖడ్గతిక్కనకు, కాటమరాజుకు పెన్నా నది ఒడ్డున సోమశిల వద్ద భీకర యుద్ధం జరిగింది. ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడి, సైన్యాన్నంతా పోగొట్టుకుంటాడు. యుద్ధములో ఓడిపోయి ఇంటికి వచ్చిన ఖడ్గ తిక్కనకు తన తల్లినుండి కానీ, భార్యనుండి కానీ ఆశించిన పలకరింపు దొరకలేదు. ఆయన భార్య ఒక నులక మంచం అడ్డు పెట్టి రెండు బిందెల నీళ్ళు, ఒక పసుపు ముద్ద పెట్టి స్నానం చేయమని చెప్పింది. ఖడ్గ తిక్కన అవి ఎందుకు అన్నపుడు ' మీరు ఆడువారివలె యుద్ధములో ఓడి పారిపోయి వచ్చారు. ఆడువారు స్నానం చేయుట ఎవరూ చూడరాదు అందుకే నులకమంచం అడ్డుగా పెట్టినాను. మీ మొహమునకు రాసుకొనుటకు ఆ పసుపు ముద్ద. ఇకనుండి ఈ ఇంటిలో నేను, మీ తల్లిగారు, మీతో కలసి ముగ్గురు ఆడవాళ్ళమూ అన్నది. ఆమె మాటలు పద్యరూపంలో:

పగరకు వెన్నెచ్చినచో
నగరే నిను మగతంపు నాయకు లెల్ల
ముగు రాడువార మైతిమి
వగపేటికి జలకమాడ వచ్చిన వేళన్.

భార్య మాటలకు సిగ్గుపడి ఎలాగో స్నానం చేసి భోజనం చేసాడు. చివర తన తల్లి ఇచ్చిన విరిగిపోయిన పోయిన పాలు చూసి 'అమ్మా పాలు విరిగిపోయినాయి ' అన్నాడు. ఆ మాటలకు అతడి తల్లి 'నాయనా నువ్వు శత్రురాజులతో యుద్ధం చేయలేక కత్తి పారవేసి పిరికివాడిలా పారిపోయి నడుము విరిగిన వాడివి అయితివి, అది చూసి పశువుల నడుములు కూడా విరిగినవి. అందుకే పాలు కూడా విరిగినవి ' అన్నది. ఆమె మాటలు పద్యరూపంలో:

అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పందక్రియ నీ
పసివైచి విరిగివచ్చిన
పసులున్ విరిగినవి వాని పాలు న్విరిగె.

పౌరుషంగా యుద్ధభూమికి తిరిగివెళ్లిన తిక్కన వీరమరణం పొందుతాడు. ఈ యుద్ధంలో చివరకు ఎవరు గెలిచారనే దానిపై స్పష్టమైన ఆధారాలు లేవు. తంగిరాల వేంకట సుబ్బారావు గారు ఈ విషయమై చాలా పరిశోధన చేసారు. యాదవుల ఆయుష్షు తీరినందున ఈ యుద్ధం సంభవించిందని గాథాకారులు చెప్పే కథలు తెలియపరుస్తాయి. ఈ యుద్ధాన్ని గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. ఖడ్గతిక్కన గుఱ్ఱంపై వచ్చి పెద్ద అరుపులతో కాటంరాజు సైన్యంపై దూకాడని ఆ తాకిడికి శత్రువులు పలాయనం చిత్తగించారని ఒక గాథ ఉంది. ఇంకొక గాథలో ఖడ్గతిక్కన యుద్ధంలో మరణించాడని వేములవాడ భీమకవి ఆతనిని బ్రతికించాడని అందువల్ల అతనికి సిద్ధయతిక్కన అను పేరు వచ్చిందని మరియొక గాథ ఉంది.

కీర్తి

[మార్చు]

సోమశిల వద్దనున సోమేశ్వరుని దేవాలయమంటపం ఎదురుగా ఒక వీరుని విగ్రహం ఉంది. అది ఖడ్గతిక్కన విగ్రహం అని అంటారు. పట్టపురాయి వద్దనున్న తిక్కాపూరులో మరియొక సైనికుడు గుఱ్ఱంపై చిత్రించి ఉంది. ఇదికూడా రణతిక్కనదేనని అక్కడి ప్రజలు చెబుతారు. యాదవులతో తెలుగుచోళులకు జరిగిన లింగాలకొండ, సోమశిల యుద్ధాలను నేటికి నెల్లూరు సీమలో వీరగాధలుగా చెప్పుకుంటారు.

నోట్స్

[మార్చు]
  1. ^ నెల్లూరు తెలుగుచోడులలో ప్రథముడైన సిద్ధి లేదా సిద్ధిబేటనికి మనుమసిద్ధి అని కూడా పేరు ఉంది. ఈయన్ను మొదటి మనుమసిద్ధిగా పరిగణిస్తే ఖడ్గ తిక్కన మంత్రిగా పనిచేసిన మనుమసిద్ధి మూడవవాడు. పూర్వచరిత్రకారులు చేసినట్టు సిద్ధిని మనుమసిద్ధిగా గణించకపోతే ఈయన రెండవ మనుమసిద్ధి.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్రుల చరిత్ర - బి.ఎస్.ఎల్.హనుమంతరావు పేజీ.214
  2. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.110
  3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.105
  4. సమగ్ర ఆంధ్ర సాహిత్యం - కాకతీయ యుగం -ఆరుద్ర పేజీ.109
  5. http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine పేజీ.131,132
  6. సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ల హనుమంతరావు పేజీ.185