Jump to content

క్షార లోహము

వికీపీడియా నుండి
(క్షార లోహం నుండి దారిమార్పు చెందింది)

విస్తృత ఆవర్తన పట్టికలో మొదటి గ్రూపులో అమర్చబడి ఉన్న హైడ్రోజన్ (H), లిథియమ్ (Li), సోడియమ్ (Na), పొటాషియమ్ (K), రుబీడియమ్ (Rb), సీసియమ్ (Cs) ఫ్రాన్షియమ్ (Fr) లను క్షార లోహాలు (Alkali metals) అంటారు. ఈ గ్రూపులో హైడ్రోజన్ మినహా మిగతా మూలకాల ఆక్సైడ్ లు నీటిలో కరిగి బలమైన క్షారాలని ఇస్తాయి. హైడ్రోజన్ పేరుకు ఈ గ్రూపులోని మూలకమైనప్పటికీ, క్షార లోహాల కంటే భిన్నమైన స్వభావం కలది. దీనికి మిగిలిన గ్రూపు సభ్యులతో పోలికలు తక్కువగా ఉంటాయి.

క్షార లోహాలు అత్యంత చురుకుగా రసాయనిక చర్యలకు గురవుతాయి. అందువల్ల ప్రకృతి సిద్ధంగా మూలక స్థితిలో లభించవు. అందుచేత ప్రయోగశాలలో వీటిని ఖనిజ నూనెలో భద్రపరుస్తారు. క్షార లోహాలన్నీ నీటితో చర్య జరుపుతాయి. భారమైనవి క్షారలోహాలు తేలికైనవాటి కంటే తీవ్రంగా చర్య జరుపుతాయి. క్షారలోహాలకు అతి తక్కువ ద్రవీభవన ఉష్ణోగ్రతలు, సాంద్రత ఉంటాయి. పొటాషియం, రుబీడియం మూలాకాలు, అత్యంత నిడివికల రేడియోధార్మిక ఐసోటోపులు ఉండటం వళ్ళ, కొద్దిపాటి హానికరము కాని రేడియోధార్మికతను ప్రదర్శిస్తాయి.

క్షార లోహాలన్నీ ప్రకృతిలో సమ్మేళనాలుగానే లభిస్తాయి: ప్రాకృతిక సమృద్ధి ప్రకారం చూస్తే, సోడియం అత్యంత సమృద్ధిగా లభిస్తూండగా, ఆ తరువాత వరుసగా పొటాషియం, లిథియం, రుబిడియం, సీసియంలు, చివరిగా ఫ్రాన్సియం లభిస్తాయి. ఫ్రాన్సియం రేడియోధార్మికత చాలా అధికం అవడం చేత ఇది చాలా అరుదుగా లభిస్తుంది.

చాలా క్షార లోహాలకు అనేక రకాల ఉపయోగాలున్నాయి. స్వచ్ఛమైన మూలకాల రూపంలో ఉన్న ప్రసిద్ధ ఉపయోగం అణు గడియారాలలో రుబిడియం, సీసియం వాడకం. సోడియం సమ్మేళనాల ఉపయోగం సోడియం-వేపర్ లాంపు. ఇది కాంతిని చాలా సమర్థవంతంగా విడుదల చేస్తుంది. ఉప్పు లేదా సోడియం క్లోరైడ్ పురాతన కాలం నుండి ఉపయోగించబడుతోంది. లిథియం మానసిక వ్యాధూల్లో ఔషధంగాను, లిథియం బ్యాటరీలలో యానోడ్‌గానూ ఉపయోగిస్తారు. సోడియం, పొటాషియం, బహుశా లిథియంలు జీవులలో ఆవశ్యకమైన మూలకాలు. ఎలక్ట్రోలైట్‌లుగా పనిచెయ్యడం వీటి ప్రధాన పాత్ర. ఇతర క్షార లోహాలు ఆవశ్యకమైన మూలకాలు కానప్పటికీ, శరీరంపై ప్రయోజనకరమైన లేదా హానికరమైన వివిధ ప్రభావాలను చూపిస్తాయి.