Jump to content

కిరణ్ మోరే

వికీపీడియా నుండి
(కిరణ్‌మోరే నుండి దారిమార్పు చెందింది)
కిరణ్ మోరే
కిరణ్ మోరే
జననంకిరణ్ మోరే
1962, సెప్టెంబర్ 4
గుజరాత్ లోని బరోడా
ఇతర పేర్లుకిరణ్ మోరే
ప్రసిద్ధి1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్

1962, సెప్టెంబర్ 4గుజరాత్ లోని బరోడాలో జన్మించిన కిరణ్ శంకర్ మోరే (Kiran Shankar More) 1984 నుంచి 1993 వరకు భారత క్రికెట్ జట్టుకు వికెట్ కీపర్ గా పనిచేశాడు. 2006 వరకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సెలెక్షన్ కమీటీకి చైర్మెన్ గా వ్యవహరించాడు. ఇతని తర్వాతనే BCCI కు ప్రస్తుతం దిలీప్ వెంగ్‌సర్కార్ నేతృత్వం వహిస్తున్నాడు. కిరణ్ మోరే ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ లీగ్ తరఫున పనిచేస్తున్నాడు.

ప్రారంభ క్రీడా జీవితం

[మార్చు]

మోరే 1970 ప్రాంతంలో అండర్-19 తరఫున క్రికెట్ ఆడినాడు.[1] ముంబాయిలో టైమ్స్ షీల్డ్ లో టాటా స్పోర్ట్స్ తరఫున, 1982లో నార్త్ లాంకషైర్ లో బారో తరఫున ఆడినాడు. 1982-83 లో వెస్ట్‌ఇండీస్ పర్యటనకు వెళ్ళిననూ టెస్ట్ ఆడే అవకాశం రాలేదు. మోరే 1983-84 రంజీ ట్రోఫిలో బరోడా తరఫున రెండు మంచి ఇన్నింగ్సులను ఆడినాడు. మహారాష్ట్ర పై 153*, ఉత్తరప్రదేశ్ పై 181* పరుగులు సాధించాడు. ఆ తర్వాత అతను చివరి వెకెట్ కు వాసుదేవ్ పటేల్ తో కల్సి 145 పరుగులు జోడించాడు. దశాబ్దం వరకు ఇది రంజీ రికార్డుగా కొనసాగింది. 1984-85 లో మోరే ఇంగ్లాండు పై రెండు వన్డే మ్యాచ్‌లు ఆడే అవకాశం లభించింది.

అంతర్జాతీయ క్రికెట్

[మార్చు]

1985-86 లో భారత జట్టులో సభ్యుడిగా ఆస్ట్రేలియా పర్యటించాడు. ప్రపంచ సీరీస్ కప్ లో సయ్యద్ కిర్మాణి గాయపడటంతో మోరేకు అవకాశం లభించడం, కిర్మాణికి క్రీడాజీవితపు అంతిమ ఘడియలు సమీపించడం జర్గాయి. ఆ టోర్నెమెంటులో మిగితా మ్యాచ్‌లకి మోరే వికెట్ కీపింగ్ చేశాడు. అది మొదలుకొని 1993 వరకు మోరేకు వికెట్ కీపింగ్ లో ఎదురులేదు, పోటీలేదు. వన్డే క్రికెట్ లో మాత్రం అతనికంటే చక్కగా బ్యాటింగ్ చేసేవారితో పోటీ ఎదురై తన స్థానాన్ని కోల్పోయాడు.

టెస్ట్ క్రికెట్ లో మోరే 1986లో ఇంగ్లాండుతో జరిగిన తొలి సీరీస్ లోనే మంచి ప్రతిభను కనబర్చాడు. 3 టెస్టులు కల్పి 16 క్యాచ్‌లు పట్టి ఇంగ్లాండు పై ఒక భారతీయ కీపర్ గా రికార్డు స్థాపించాడు. బ్యాటింగ్ లో కూడా అతను సగటులో రెండో స్థానంలో నిల్చాడు. రెగ్యులర్ బ్యాట్స్‌మెన్లు విఫలమైన సందర్భాలలో కూడా మోరే ఉత్తమ ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 1988-89 లో వెస్ట్‌ఇండీస్ పై భారత్ 63 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన పరిస్థితిలో బ్యాటింగ్ చేసి 50 పరుగులు సాధించాడు. అలాగే అదే సం.లో పాకిస్తాన్ పై ఆడుతూ కరాచి టెస్టులో భారత్ ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న పరిస్థితిలో విలువైన 58 పరుగులు చేసి నాటౌట్ గా నిల్చాడు. కాబట్టి కరాచి ఇన్నింగ్స్ అతని క్రీడాజీవితంలో అత్యుత్తమమైనదని చెప్పవచ్చు[2]. 1988-89 లో వెస్ట్‌ఇండీస్ తో జరిగిన మద్రాసు టెస్ట్ లో 6 గురిని స్టంప్ ఔట్ చేయడం, అందులోనూ 5 గురిని రెండో ఇన్నింగ్సులో చేసి టెస్ట్ రికార్డు సృష్టించాడు.

1990 తర్వాత

[మార్చు]

1990లో న్యూజీలాండ్ పర్యటించిన అజహరుద్దీన్ నేతృత్వంలోని భారత జట్టుకు ఉప సారథిగా నియమించబడ్డాడు. నేపియర్ లో జరిగిన రెండో టెస్టులో 73 పరుగులు చేసి అతని అత్యుత్తమ స్కోరును నమోదుచేసుకున్నాడు. తర్వాత ఇగ్లాండు పర్యటించిన భారత జట్టుకు ఉప సారథి కిరీటం రవిశాస్త్రికి వదలిపెట్టాల్సి వచ్చింది. లార్డ్స్ టెస్టులో ఓపెనర్ గ్రాహం గూచ్ 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్ ను మోరే వదలిపెట్టడంతో చివరికి గూచ్ 333 పరుగుల మహా ఇన్నింగ్స్ ఆడినాడు. 1994 ప్రారంభంలో బరోడాకే చెందిన మరో వికెట్ కీపర్ నయన్ మోగియా వల్ల మోరే భారత జట్టులో స్థానం కోల్పోయాడు. బరోడా తరఫున మోగియా కూడా ఆడే పరిస్థితి వచ్చినప్పుడు మోరే కేవలం బ్యాట్స్‌మెన్ గా మాత్రమే ఆడేవాడు. 1998 వరకు మోరే బరోడా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 1987 కిరణ్ మోరే Kiran More-Alembic cricket academy ని స్థాపించాడు. 2002 నుంచి 2006 వరకు అతడు సెలెక్షన్ కమిటీ చైర్మెన్ గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఆ స్థానం దిలీప్ వెంగ్‌సర్కార్ కు వదిలి తను జీ టెలివిజన్ స్థాపించిన ఇండియన్ క్రికెట్ లీగ్ వైపు మొగ్గుచూపాడు.

మూలాలు

[మార్చు]

^ Interview with More

బయటి లింకులు

[మార్చు]