Jump to content

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ప్రభుత్వం

వికీపీడియా నుండి
(ఆంద్రప్రదేశ్ పంచాయితీ రాజ్ వ్యవస్థ నుండి దారిమార్పు చెందింది)
పంచాయితీ రాజ్ వ్యవస్థలో భాగంగా గ్రామ పంచాయితీ పరిపాలనా నిర్వహణ కార్యాలయం

గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలని గాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలనా ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ 'రిప్పన్' ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది.కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినంగా పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 537 జిల్లాపంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, 2,34,676 గ్రామపంచాయతీలు పనిచేస్తున్నాయి. జిల్లా పంచాయతీ స్థాయిలో 11,825 మంది ప్రతినిధులు, మండల పంచాయతీ స్థాయిలో 1,10,070 మంది ప్రతినిధులు, గ్రామపంచాయతీ స్థాయిలో 20,73,715 మంది ప్రతినిధులు ఓటర్ల ద్వారా ఎన్నికయ్యారు.

పంచాయతీరాజ్ ఎందుకు?

[మార్చు]
  1. వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి.
  2. ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి.
  3. గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి.
  4. స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి.
  5. పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి.

పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి. ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదు. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయాలు.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థ

[మార్చు]

ప్రజలందరూ అధికారంలో పాలుపంచుకోవడాన్ని ప్రజాస్వామ్య పరిపాలన అంటారు. పరిపాలన వికేంద్రీకరణతోనే దేశంలో పాలన సమర్థంగా సాగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పనిభారాన్ని తగ్గించి స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి. సమాజ వికాస ప్రయోగాలు, జాతీయ విస్తరణ సేవా పథకాల అమలు తీరును పర్యవేక్షించి, తగిన సూచనలు ఇవ్వడానికి 1957 జనవరిలో ప్రణాళికా ప్రాజెక్టు కమిటీ 'బల్వంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ'ని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1957 నవంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా 1958 జనవరిలో జాతీయాభివృద్ధి మండలి దాన్ని అంగీకరించింది.

పంచాయతీరాజ్ సంస్థల విధులు

[మార్చు]
  1. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయిలో నిర్వహించే అభివృద్ధి సంబంధ విధులన్నింటిని జిల్లా పరిషత్తులకు అప్పగించాలి.
  2. ఈ విధంగా వికేంద్రీకరించాల్సిన వాటిలో వ్యవసాయం, దానికి సంబంధించిన విధులు, ఆరోగ్యం, విద్య, రోడ్లు, గ్రామీణ పరిశ్రమలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మొదలైన విధులను కమిటీ ప్రత్యేకంగా పేర్కొంది.
  3. జిల్లాస్థాయికి వికేంద్రీకరించిన రాష్ట్ర కార్యక్రమాలు, ప్రణాళికా రూపకల్పనను జిల్లా పరిషత్తుకు అప్పగించగా, వాటి అమలును మండల పంచాయతీలకు అప్పగించారు.
  4. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా చేసే పౌరసేవా విధులు, సంక్షేమానికి సంబంధించిన విధులను కూడా మండల పంచాయతీకి అప్పగించారు.
  5. రెవెన్యూ, శాంతి భద్రతల లాంటి విధులు కలెక్టర్ వద్దనే ఉండాలనీ, అభివృద్ధి పనులకు అవసరమైనంత వరకు మాత్రమే అవి పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇవ్వాలనీ అశోక్ మెహతా కమిటీ సూచించింది.
  6. జిల్లాస్థాయిలో ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన పనులను మొత్తం జిల్లా పరిషత్తుకే అప్పగించాలి. జిల్లా పరిషత్తు అభివృద్ధి శాఖల అధికారులు దానికే చెందిన ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉండాలి.
  7. ప్రతి మండల పంచాయతీలో వ్యవసాయ విస్తరణాధికారి, పశుపోషణ, చేపల పెంపకం, చిన్నతరహా పరిశ్రమలు, ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగులందరూ ఒక పూర్తికాల పంచాయతీ మండల కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉండాలి.

పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు

[మార్చు]
  1. పంచాయతీలకు గ్రామపరిధిలో చేపట్టదలచిన అభివృద్ధికి అవి రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు అవుతాయి.
  2. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలక వర్గాలు ప్రతిపాదించిన పనులకు పంచాయతీల ఖాతాలకే నేరుగా నిధులు లక్షల్లో చేరుతాయి.
  3. పాలక వర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు అవుతాయి.
  4. ఒక్కో గ్రామ పంచాయతీకి 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి.
  5. రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. గ్రామసభ అభీష్టం మేరకు లింకు రోడ్లు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించుకోవచ్చు.
  6. 12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు.

ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదార్లు, డ్రెయిన్ల పనులు నిలిచిపోయాయి.గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినప్పటికీ గడిచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకరించలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ సామగ్రి తదితర అవసరాలు తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

పంచాయతీరాజ్ ఆర్థిక వనరులు

[మార్చు]

పంచాయతీరాజ్ సంస్థలకు కొన్ని తప్పనిసరి పన్ను విధించే అధికారాలను బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ కల్పించింది. అవి: ఇంటిపన్ను, వృత్తిపన్ను, వినోదపు పన్ను. ఇంటిపన్ను, వృత్తిపన్ను, వినోదపు పన్నులే కాకుండా వీధి దీపాలు, పరిశుభ్రత, నీటి సరఫరా లాంటి వాటిపై ఫీజుల విధింపు, స్టాంపు డ్యూటీ లాంటి మరికొన్నింటికి సంబంధించి పన్నులను విధించాలని, ఇవన్నీ కాకుండా తలసరి రూ. 2.50 చొప్పున మండల పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పాలన

[మార్చు]

రాష్ట్రంలో పూర్వకాలంలో కరణం, మునసబు, పట్వారీ, పటేల్ లాంటి గ్రామాధికారుల వ్యవస్థ అమల్లో ఉండేది. వీరు ఆయా గ్రామాల్లో స్థిర నివాసం ఉంటూ పాలనా వ్యహహారాలను చూసుకునేవారు. ప్రభుత్వం 1985లో వీరిని తొలగించి, గ్రామ పాలనాధికారుల (వి.ఎ.ఒ.) విధానాన్ని ప్రవేశపెట్టింది. పంచాయతీలను రెవెన్యూ వ్యవస్థ నుంచి వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వి.ఆర్.ఒ. విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రతి 5,000 జనాభాకు ఒక్కరు; 5,000 - 10,000 జనాభాకు ఇద్దరు; 10,000 - 15,000 జనాభాకు ముగ్గురు చొప్పున గ్రామ రెవెన్యూ అధికారులను (వి.ఆర్.ఒ.) నియమించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ పంచాయతీ కార్యదర్శులను వి.ఆర్.ఒ.లుగా తీసుకున్న నేపథ్యంలో వారందరినీ 'ఎక్కడివారు అక్కడే' అన్న పద్ధతిలో ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండాల్సినవారి కంటే ఎక్కువమంది, కొన్ని చోట్ల తక్కువమంది, మరికొన్ని చోట్ల అసలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ అసమానతల కారణంగా ప్రజలకే కాకుండా పాలనాపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వీఆర్వోలను సొంత గ్రామాలకు బదిలీ చేయడాన్ని నిలిపేసింది. జిల్లాల్లో ఖాళీగా ఉన్న వి.ఆర్.ఒ. పోస్టులను సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ భర్తీ చేస్తుంది. కొన్ని గ్రామాలను కలిపి ఒక సముదాయం (క్లస్లర్) గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లకు 17,008 వి.ఆర్.ఒ.ల అవసరం ఉంది. ప్రస్తుతం 14,800 మంది వి.ఆర్.ఒ.లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 5,000 జనాభా ఉన్న రెండు, మూడు పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టరుకు ఒక కార్యదర్శిని నియమించాలి. ప్రతి క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ప్రతి కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్న పంచాయతీలను అప్పగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అడవుల మధ్యలో ఉండే చిన్న పంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. కనీసం గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలంటే గతంలో మాదిరిగా పంచాయతీ, రెవెన్యూ శాఖలను ఏకం చేయాలి. మన రాష్ట్రంలో 1127 రెవెన్యూ మండలాలు, 1094 మండల పరిషత్‌లు, 21,943 గ్రామ పంచాయతీలు, 28,124 రెవెన్యూ గ్రామాలు, 26,614 నివాసిత గ్రామాలు, 1510 నివాసాలు లేని గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. చట్టరీత్యా కమీషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయతీగా సృష్టించవచ్చు. 500కు పైగా జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక 'గ్రామ పంచాయతీ' ఉంటుంది. గ్రామ పంచాయతీలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామానికి ఒక 'గ్రామ సభ' కూడా అమల్లోకి వచ్చింది. గ్రామంలోని ఓటర్లు అందరూ ఆ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు.

సర్పంచ్

[మార్చు]

గ్రామ పంచాయతీ అధ్యక్షుడిని 'గ్రామ సర్పంచ్' అంటారు. సర్పంచ్‌ను గ్రామంలోని 18 సంవత్సరాలు నిండిన వయోజనులు అందరూ రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ఎన్నుకుంటారు. 21 సంవత్సరాలు నిండినవారు సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అర్హులు. గ్రామ పంచాయతీ సభ్యుల పదవీ కాలం 5 సంవత్సరాలు.సర్పంచ్ అధికారాలు » ఉపసర్పంచ్ ఎన్నిక కోసం ఏర్పాట్లు చేయడం. » గ్రామ పంచాయతీ రికార్డులను చూడటం. » ఎగ్జిక్యూటివ్ అధికారిని నియంత్రించడం. » గ్రామాభివృద్ధి అధికారి ద్వారా గ్రామ పంచాయతీకి కావాల్సిన సమాచారం సేకరించడం. » సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తేవడం. » గ్రామ పంచాయతీ నిర్ణయాలను అమలు చేయడం. » గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం

గ్రామసభ విధులు

[మార్చు]

» ప్రతి గ్రామసభ సంవత్సరానికి 4 సార్లు (జనవరి 2, ఏప్రిల్ 14, జూలై 1, అక్టోబరు 3 తేదీలలో ) సమావేశం కావాలి. » సాలీనా పంచాయతీకి సంబంధించిన ఖాతాలు, ఆడిట్ నివేదికను గ్రామసభకు సమర్పిస్తుంది. » గడిచిన ఏడాది పాలనా నివేదిక, కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొన్ని ముఖ్య విషయాలను గ్రామసభ చర్చిస్తుంది. » గ్రామసభ సమావేశాలను ఏర్పాటు చేయని సర్పంచ్ పదవి కోల్పోతాడు. కానీ వాస్తవానికి గ్రామసభ సమావేశాలను సక్రమంగా నిర్వహించడం లేదు. » కొన్ని గ్రామాల్లో అతి తక్కువమంది గ్రామస్థులతో మొక్కుబడిగా సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం గ్రామసభ జరిగినట్లు నివేదిక సమర్పిస్తున్నారు. » ప్రతి గ్రామసభ సంవత్సరానికి రెండు సార్లు సమావేశం కావాలి. » సాలీనా పంచాయతీకి సంబంధించిన ఖాతాలు, ఆడిట్ నివేదికను గ్రామసభకు సమర్పిస్తుంది. » గడిచిన ఏడాది పాలనా నివేదిక, కొత్త పనులకు సంబంధించిన ప్రతిపాదనతో పాటు కొన్ని ముఖ్య విషయాలను గ్రామసభ చర్చిస్తుంది. » గ్రామసభ సమావేశాలను ఏర్పాటు చేయని సర్పంచ్ పదవి కోల్పోతాడు. కానీ వాస్తవానికి గ్రామసభ సమావేశాలను సక్రమంగా నిర్వహించడం లేదు. » కొన్ని గ్రామాల్లో అతి తక్కువమంది గ్రామస్థులతో మొక్కుబడిగా సమావేశాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ప్రభుత్వానికి మాత్రం గ్రామసభ జరిగినట్లు నివేదిక సమర్పిస్తున్నారు.

గ్రామ పంచాయతీ నిర్మాణం

[మార్చు]

» గ్రామ పంచాయతీలో సభ్యులుగా ప్రజలు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకున్న సర్పంచ్‌తో పాటు, వివిధ వార్డు మెంబర్లు ఉంటారు. » ప్రజలు నేరుగా ఎన్నుకున్నప్పటికీ సర్పంచ్ పంచాయతీలో ఒక సభ్యుడిగా కొనసాగుతాడు. కాబట్టి అతడిని పంచాయతీ అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించలేదు. » సర్పంచ్ లేనప్పుడు పంచాయతీ సభ్యులు ఎన్నుకున్న ఉప సర్పంచ్ సమావేశానికి అధ్యక్షత వహిస్తాడు. పంచాయతీ అతడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు. » సర్పంచ్ గ్రామ సభ, పంచాయతీలను సమావేశపరిచి వాటికి అధ్యక్షత వహిస్తాడు. ప్రజా స్థలంలో రోడ్లపై విద్యుద్దీపాలను ఏర్పాటు చేయడం. » మురుగు కాలువల నిర్మాణం, వాటి నిర్వహణ. » రోడ్లను శుభ్రపరచడం, చెత్తా చెదారం తొలగించడం. పాడుబడ్డ బావులు, కుంటలు, గుంతలను పూడ్చడం. » ప్రజా మరుగుదొడ్లను ఏర్పాటు చేసి శుభ్రపరచడం, శ్మశానాలను నిర్వహించడం. దిక్కులేని శవాలను, పశువుల కళేబరాలను పాతిపెట్టడం. » కలరా, మలేరియా లాంటి అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవడం. » తాగునీరు సరఫరా చేయడం, జనన మరణాలను నమోదు చేయడం, పశుశాలలను ఏర్పాటు చేయడం. పై పనులే కాకుండా గ్రామ పంచాయతీ కింది విధులను కూడా నిర్వహించవచ్చు. » ధర్మశాలలు, విశ్రాంతి భవనాల నిర్మాణం, వాటి నిర్వహణ. » రోడ్ల పక్కన, ఖాళీ స్థలాల్లో చెట్లను నాటి సంరక్షించడం. » సాంఘిక, ఆరోగ్య, విద్యా వసతులను కల్పించడం. » కుటీర పరిశ్రమలు, వాణిజ్యాన్ని అభివృద్ధి చేయడం. » ఆసుపత్రుల ఏర్పాటు, నిర్వహణ. ఆట స్థలాలు, క్లబ్బులు, రేడియో సెట్లను ఏర్పాటు చేసి ప్రజావినోదం కోసం వసతి కల్పించడం. » పార్కులు, గ్రంథాలయాల ఏర్పాటు, నిర్వహణ. » వికలాంగులు, రోగులు, అనాథలకు సహాయం చేయడం. » నర్సరీలు, ప్రదర్శనా క్షేత్రాల ఏర్పాటు. వ్యవసాయదారులకు మంచి విత్తనాలు, నూతన వ్యవసాయ పద్ధతులను అందించడం. » సహకార సంఘాలను ప్రోత్సహించడం. గిడ్డంగులు, మార్కెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ. » ప్రసూతి కేంద్రాలను, శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పరచి నిర్వహించడం. » బజారు కుక్కలను, ఇతర జంతువులను తొలగించడం. » ఉత్సవాలను, సంతలను, జాతరలను ఏర్పాటు చేయడం.

గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు

[మార్చు]

గ్రామ పంచాయతీకి కింది వనరుల ద్వారా ఆదాయం వస్తుంది. » పన్నుల ద్వారా వచ్చే ఆదాయం. » ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం. » ఇంటిపన్ను, ఆస్తుల బదిలీ పన్ను, ప్రకటనలపై పన్ను, వృత్తి పన్ను, భూమిశిస్తు, జంతువులపై పన్ను, దుకాణాలపై పన్ను మొదలైనవాటి ద్వారా వచ్చే ఆదాయం. » విశ్రాంతి భవనాలు, ఖాళీ స్థలాలు, మార్కెట్లు లాంటి పంచాయతీ మూలధనంపై వచ్చే ఆదాయం. » ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా వచ్చే ఆదాయం. » వివిధ సమాజాభివృద్ధి కార్యక్రమాల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే గ్రాంట్లు. » పాఠశాలలు, ఆసుపత్రులు, గ్రంథాలయాలను ఏర్పాటుచేసి నిర్వహించడానికి స్వచ్ఛందంగా దాతలు ఇచ్చే విరాళాలు.

గ్రామ పంచాయతీ అధికారాలు

[మార్చు]

కార్యనిర్వాహకుడు లేదా సర్పంచ్ రూపొందించిన బడ్జెట్‌ను గ్రామ పంచాయతీ ఆమోదించిన తర్వాత, దాన్ని డివిజినల్ పంచాయతీ అధికారికి సమర్పిస్తుంది. డివిజినల్ పంచాయతీ అధికారి దానికి సవరణలు లేదా సూచనలు చేస్తూ ఒక నెలలోగా గ్రామ పంచాయతీకి పంపించాలి. ఆ సూచనలను పాటిస్తూ తిరిగి బడ్జెట్ను ఆమోదించే అధికారం మాత్రం పంచాయతీకే ఉంటుంది.

స్థానిక స్వపరిపాలన

[మార్చు]

ప్రాచీన కాలం నుంచి మన దేశంలో స్థానిక స్వపరిపాలన విధానం అమల్లో ఉంది. మౌర్యులు, చోళులు, పల్లవుల సామ్రాజ్యాల్లో స్థానిక స్వపరిపాలన సంస్థలు అభివృద్ధి చెందాయి. 'చార్లెస్ మెట్‌కాఫ్' భారత గ్రామీణ స్థానిక స్వపరిపాలన సంస్థలను 'లిటిల్ రిపబ్లిక్స్'గా అభివర్ణించాడు. మన దేశంలో ప్రాచీన కాలం నుంచే స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయని మెగస్తనీస్ 'ఇండికా' అనే గ్రంథంలో పేర్కొన్నాడు. శుక్రాచార్యుడు తన నీతి శాస్త్రంలో గ్రామాల కామన్‌వెల్త్ ఉన్నట్లుగా పేర్కొన్నాడు. రామాయణంలో జనపదాన్ని అనేక గ్రామాల సమాఖ్యగా వర్ణించారు. 'గ్రామ సంఘాలు' అనే పేరుతో పరిపాలన జరిగినట్లు మహాభారతంలోని శాంతిపర్వం తెలియజేస్తుంది. మధ్యయుగంలో స్థానిక స్వపరిపాలన నిర్లక్ష్యానికి గురైంది. ఈ కాలంలో నిర్మాణాత్మక సంస్థలను ఏర్పాటు చేసి వాటి ద్వారా స్థానిక ప్రజల అవసరాలు తీర్చడానికి ఎలాంటి కృషి చేయలేదు. మొగలుల కాలంలో ఏర్పాటు చేసిన కొత్వాల్ వ్యవస్థ శిస్తు వసూలు, శాంతి భద్రతల పరిరక్షణపై తప్ప అభివృద్ధిపై శ్రద్ధ వహించలేదు. ప్రజాస్వామ్యం విజయానికి పరిపాలనలో వికేంద్రీకరణ అవసరమని పేర్కొనే బ్రిటిష్‌వారు కూడా స్థానిక సంస్థల అభివృద్ధిని పట్టించుకోలేదు. వారు జిల్లా కలెక్టర్ పదవిని ఏర్పాటు చేసి శిస్తు వసూలుపైనే దృష్టి కేంద్రీకరించారు. 1870లో లార్డ్ మేయో కాలంలో ప్రవేశపెట్టిన తీర్మానం బ్రిటిష్వారి దృక్పథంలో మార్పును తెలియజేస్తుంది. 1882లో 'రిప్పన్ ప్రభువు' ప్రవేశపెట్టిన తీర్మానాన్ని భారతదేశంలో స్థానిక స్వపరిపాలనకు 'మాగ్నాకార్టా'గా పేర్కొంటారు. గ్రామాలు, మండలాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు తమ స్థానిక అవసరాలను సొంతంగా నిర్వహించుకోవడాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు. అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగించడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ (Democratic Decentralisation).

స్థానిక స్వపరిపాలన సంస్థల ఆవశ్యకత

[మార్చు]

గ్రామ, పట్టణ సమస్యలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే స్థానికులకే బాగా తెలుస్తాయి. తమ అవసరాలకు అనుగుణంగా చక్కటి పథకాలను రూపొందించుకుని, నిర్వహించుకునే అవకాశం వారికి ఉంటుంది. మంచినీటి సరఫరా, మురికినీటి కాల్వల నిర్మాణం - నిర్వహణ, రోడ్లు, వంతెనలు, విద్య, వినోదం, ఆరోగ్యం, పరిశుభ్రత, వీధి దీపాలు మొదలైనవాటిని స్థానిక ప్రజల అవసరాలుగా పేర్కొనవచ్చు. వీటిని స్థానికులు పొదుభ్పుhgగా, త్వరగా, సమర్థవంతంగా తీర్చుకోవచ్చు. స్థానిక అవసరాలను స్థానికులే తీర్చుకోవడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తగ్గుతుంది. జాతీయ సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టడానికి ప్రభుత్వాలకు అవకాశం ఉంటుంది. స్థానిక స్వపరిపాలన సంస్థల వల్ల ప్రయోజనాలు ¤ స్థానిక స్వపరిపాలనా సంస్థలు ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని తీసుకువస్తాయి. ¤ సాధారణంగా స్థానిక పరిపాలనలో ప్రజలకు భాగస్వామ్యం ఉంటుంది. ఈ శిక్షణ, అనుభవం భవిష్యత్తులో వారు రాష్ట్ర, జాతీయ స్థాయి ప్రభుత్వాల్లో సమర్థవంతంగా పాల్గొనేందుకు సహాయపడతాయి. ¤ పౌరుల్లో మంచి లక్షణాలు, స్నేహభావం, త్యాగం, బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందిస్తాయి. ¤ అధికార వికేంద్రీకరణ కార్యరూపం దాల్చడానికి ఈ సంస్థలు దోహదం చేస్తాయి. ¤ స్థానిక పాలనలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల జోక్యాన్ని తగ్గించి స్థానిక ప్రజల స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని కాపాడతాయి. ¤ ప్రజాస్వామ్య విజయం చాలావరకు స్థానిక స్వపరిపాలన సంస్థలపై ఆధారపడి ఉంటుంది. ¤ ప్రజాస్వామ్య సంస్థల పట్ల ప్రజల సహకారానికి స్థానిక స్వపరిపాలన సంస్థల ప్రోత్సాహం ఎంతో అవసరం. స్వాతంత్య్రానంతరం మన రాజ్యాంగం స్థానిక స్వపరిపాలనా సంస్థలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది. ఆదేశిక సూత్రాల్లోని 40వ అధికరణలో గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి పేర్కొన్నారు. స్వయం పరిపాలనా విభాగాలుగా రూపాంతరం చెందడానికి అవసరమయ్యే అధికారాలను వాటికి ఇవ్వాలని సూచించారు. జాతిపిత మహాత్మాగాంధీ కూడా గ్రామ పంచాయతీల ఏర్పాటు, వాటిని అభివృద్ధి చేయాల్సిన ప్రాముఖ్యాన్ని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక స్వపరిపాలన విధానం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ 1959 నవంబరు 1న ఏర్పడింది. 1959లో బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించిన మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని రాష్ట్రంలో అమలుచేశారు. రాజస్థాన్ తర్వాత ఈ విధానాన్ని అమలుపరిచిన ఘనత ఆంధ్రప్రదేశ్‌కు దక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలుచేశాయి. అన్ని రాష్ట్రాల్లోనూ పంచాయతీరాజ్ వ్యవస్థ ఒకే రకంగా లేదు. కొన్ని మూడంచెల విధానాన్ని అమలుచేస్తే, మరికొన్ని రెండు లేదా ఒక అంచె విధానాన్ని ప్రోత్సహించాయి. ఈ సంస్థల పేర్లు కూడా వివిధ రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉన్నాయి. 1959లో ఆంధ్రప్రదేశ్‌లో అమలుచేసిన స్థానిక స్వపరిపాలనా విధానంలోని మూడంచెలు 1) గ్రామ స్థాయి - పంచాయతీ 2) బ్లాకు స్థాయి - పంచాయతీ సమితి 3) జిల్లా స్థాయి - జిల్లా పరిషత్ పంచాయతీ సమితి ఆధ్వర్యంలో ఎక్కువ గ్రామాలు ఉండటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు సమర్థవంతంగా అమలుకావడం లేదని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వ పాలనను ప్రజల దగ్గరకు తీసుకెళ్లే ఉద్దేశంతో 20-30 గ్రామాలతో ఒక మండల ప్రజాపరిషత్ను ఏర్పాటు చేశారు. ఈ విధంగా రాష్ట్రంలో మొత్తం 1104 మండల ప్రజాపరిషత్లు ఏర్పడ్డాయి. ఈ వ్యవస్థ కూడా మూడంచెల్లోనే ఉంది. అవి 1) గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ 2) మండల స్థాయి - మండల ప్రజా పరిషత్ 3) జిల్లా స్థాయి - జిల్లా ప్రజాపరిషత్ ఈ విధానం 1994 వరకు అమల్లో ఉంది. ప్రస్తుత స్థానిక స్వపరిపాలనా వ్యవస్థ 1994 పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఏర్పడింది. ఇది కూడా మూడంచెల్లోనే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1125 మండల పరిషత్‌లు ఉన్నాయి. 1) గ్రామ స్థాయి - గ్రామ పంచాయతీ 2) మండల స్థాయి - మండల ప్రజాపరిషత్ 3) జిల్లా స్థాయి -జిల్లా ప్రజాపరిషత్ స్థానిక స్వపరిపాలనా సంస్థలను స్థూలంగా రెండు రకాలుగా విభజించవచ్చు. అవి 1) పట్టణ ప్రాంతాల పాలన 2) గ్రామీణ ప్రాంతాల పాలన