Jump to content

అమరచింత సంస్థానం

అక్షాంశ రేఖాంశాలు: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E / 16.336389; 77.805556
వికీపీడియా నుండి
(అమరచింత సంస్థానము నుండి దారిమార్పు చెందింది)
ఆత్మకూరు
—  రెవెన్యూ గ్రామం, (జనగణన పట్టణం)  —
ఆత్మకూరు is located in తెలంగాణ
ఆత్మకూరు
ఆత్మకూరు
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మకూరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°20′11″N 77°48′20″E / 16.336389°N 77.805556°E / 16.336389; 77.805556
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వనపర్తి జిల్లా
మండలం ఆత్మకూరు
జనాభా (2011)
 - మొత్తం 12,297
 - పురుషుల సంఖ్య 6,194
 - స్త్రీల సంఖ్య 6,103
 - గృహాల సంఖ్య 2,636
పిన్ కోడ్ 509131
ఎస్.టి.డి కోడ్ 08504

అమరచింత సంస్థానం, ఇప్పటి వనపర్తి జిల్లా, (పునర్య్వస్థీకరణకు ముందు మహబూబ్ నగర్) జిల్లాలో 69 గ్రామాలు కలిగి దాదాపు 190 చ.కి.మీ.ల విస్తీర్ణములో వ్యాపించి ఉండేది. ఈ సంస్థానం రాజధాని ఆత్మకూరు. ఈ సంస్థానం ఆత్మకూరు సంస్థానమని కూడా వ్యవహరించబడినది. 1901 జనాభా లెక్కల ప్రకారము 34,147 జనాభాతో మొత్తము 1.4 లక్షల రెవెన్యూ ఆదాయం కలిగి ఉండేది.[1] అందులో 6,363 రూపాయలు నిజాముకు కప్పంగా చెల్లించేవారు. సంస్థానం రాజుల నివాస గృహమైన ఆత్మకూరు కోట ఇప్పటికీ పఠిష్టంగా ఉంది.దీనికి మరో పేరు తిప్పడంపల్లి కోట అని కూడా వ్యవహరిస్తారు. ఆమరచింత సంస్థానం చాలా పురాతనమైన సంస్థానం. సంస్థానం దక్షిణ భాగాన గద్వాల సంస్థానం, సరిహద్దున కృష్ణా నది ప్రవహిస్తుంది.నదీ తీరం ఎత్తు వలన నది జలాలు వ్యవసాయానికి ఉపయోగించుటకు సాధ్యం కాదు. అమరచింత, ఆత్మకూరు అత్యంత నాణ్యమైన మేలు మస్లిన్‌ బట్టతో నేసిన దస్తీలు, ధోవతులు, బంగారు, పట్టు అంచులతో నేసిన తలపాగలకు ప్రసిద్ధి చెందాయి.

భౌగళిక స్వరూపం

[మార్చు]

అమరచింత సంస్థానం వనపర్తి జిల్లా ఏర్పడకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఆత్మకూరు రాజధానిగా ఉండేది. మొత్తం 69 గ్రామాలతో 190 చదరపు కి.మీ. విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థానానికి దక్షిణాన గద్వాల సంస్థానం ఉండేది, దక్షిణ సరిహద్దున కృష్ణానది ప్రవహిస్తూండేది.[2] ఈ సంస్థానానికి తూర్పున వనపర్తి సంస్థానం, పడమరన రాయచూరు, ఉత్తరాన నిజాం సరిహద్దులు, దక్షిణాన గద్వాల సంస్థానాలు ఉండేవి.

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

1901 నాటికి 1.4 లక్షల ఆదాయం కలిగి, అందులో 6,363 రూపాయలు నిజాంకు కప్పం కట్టేవారు.[1]

చరిత్ర

[మార్చు]

కాకతీయుల కాలంలో గోన బుద్ధారెడ్డి అధీనంలో వర్ధమానపురం ఉండేది. రెడ్డిరాజులు ఈ సంస్థానాన్ని పరిపాలించారు. దానికి గోపాలరెడ్డి అను వ్యక్తి దేశాయిగా ఉండేవాడు. అతని అమూల్య సేవలకు గుర్తింపుగా బుద్ధారెడ్డి సా.శ. 1292లో మక్తల్ పరగణాను గోపాలరెడ్డికి నాడగౌడికంగా ఇచ్చాడు. గోపాలరెడ్డి అనంతరం అతని రెండో కుమారుడు చిన్న గోపిరెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. మక్తల్ తో పాటు మరో నాలుగు మహాళ్ళు గోపిరెడ్డి నాడగౌడికం కిందికి వచ్చాయి. ఆ నాలుగింటిలో అమరచింత ఒకటి. ఈ చిన్న గోపిరెడ్డి మనువడి మనువడి పేరు కూడా గోపిరెడ్డే. ఇతనిని ఇమ్మడి గోపిరెడ్డి అని అంటారు. ఇతను సా.శ. 1654 ప్రాంతానికి చెందినవాడు. ఇతని అన్నగారు సాహెబ్ రెడ్డి. వారసత్వంగా వచ్చిన అయిదు మహాళ్ళలో సాహెబ్ రెడ్డికి మూడు మహాళ్ళు పోగా, మిగిలిన రెండు మహాళ్ళు వర్ధమానపురం, అమరచింత ఇమ్మడి గోపిరెడ్డి వంతులోకి వచ్చాయి. సా.శ.1676 ప్రాంతంలో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి నాడగౌడికానికి వచ్చాడు. ఆ తర్వాత ఈ అమరచింత క్రమంగా వృద్దిచెంది సంస్థానంగా రూపొందింది.[3] సర్వారెడ్డి అభ్యుదయ విధానాలు కలవాడు. నీటి వనరులు పెంచడానికి పెద్దవాగుకు ఆనకట్ట కట్టించాడు. ఇతను ఔరంగజేబు సైన్యాలకు సాయం చేశాడు. తత్ఫలితంగా జండా, నగరా, 500 సవార్లు మొదలైన రాజలాంఛనాలు పొందాడు. ఇతని తరువాత మరో ఆరుగురు రాజులు ఈ సంస్థానాన్ని పాలించారు.అమరచింత సంస్థాన వంశం వారసులలో ఒకడైన రాజా శ్రీరాం భూపాల్‌ మరణించిన తర్వాత అతని భార్య రాణీ భాగ్యలక్ష్మమ్మకు న్యాయబద్ధంగా సంస్థానం వారసత్వం సంక్రమించింది.

సవాయి రాజా శ్రీరాంభూపాల్, 1930 మేలో మరణించగా, ఆయన భార్య రాణీ భాగ్యలక్ష్మమ్మ, పాలనా అధికారం తనకు సంక్రమించాలని నిజాం ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని పాలనహక్కులను పొందింది. ఆ తర్వాత 1934లో సంతానాన్ని దత్తత తీసుకునేందుకు దరఖాస్తు పెట్టుకొని, అది మంజూరు అయిన తర్వాత, 1939 ఏప్రిల్ 24వ తేదీన, సోంభూపాల్‌ను దత్తత తీసుకున్నది.[4] రాణీ భాగ్యలక్ష్మమ్మ సంస్థానధీశురాలిగా కొనసాగిన అనంతరం[5] ఆమె దత్తపుత్రుడు, ముక్కెర వంశానికి చెందిన రాజా సోంభూపాల్‌ 1962లో అమరచింత సంస్థానానికి రాజుగా పట్టాభిషేకం జరుపుకున్నాడు.[6] సంస్థానం రాణీ భాగ్యలక్ష్మమ్మ పాలనలో ఉన్నప్పుడు 1948లో హైదరాబాదు రాజ్యంలో విలీనమైంది. ఆ తర్వాత ఈ వంశస్థులు నామమాత్రపు రాజులుగా మిగిలిపోయారు.

సంస్థాన రాజుల వంశక్రమం

[మార్చు]
గోపాలరెడ్డి
( 13 వ శ.)
↓
↓ —————————————————————————————————————↓
(........................) చిన్న గోపిరెడ్డి
↓ ( ముని మనుమలు )
↓————————————————————————————————————————————↓
సాహెబ్ రెడ్డి ఇమ్మడి గోపిరెడ్డి
( 1654 )
↓
సర్వారెడ్డి
( 1676 )

సంస్థానాధికారిపై తిరుపతి కవుల గ్రంథం

[మార్చు]

ఈ సంస్థానాన్ని తిరుపతి కవులు సందర్శించారు. ఇక్కడి ప్రభువులను కలుసుకోవాలనే వారి కోరికకు ధర్మాధికారిగా పనిచేసే ఒక పండితకవి అడ్డుతగిలాడు. వారికి వీరికి వాదన జరిగింది. పండితకవి ప్రభువులకు చాడీలు చెప్పి, వీరికి ప్రభువుల సత్కారాన్ని దూరం చేశాడు. దీనితో ఆగ్రహించిన జంటకవులు ఆ అధికారిని అధిక + అరి అని చమత్కరిస్తూ, అన్యాపదేశంగా నిందిస్తూ 27 పద్యాలతో కూడిన లఘుకృతిని రచించారు. దీనికి శనిగ్రహం అని పేరు పెట్టారు. అందులో ఒక పద్యం....

ధరణీ నాయకుడుత్తముండవని నిన్ ధర్మాధికారమ్మునం
దు రహిన్నిల్పుట తుచ్చ బుద్ధివయి క్రిందున్ మీదునుం గాన కె
ల్లరి కార్యమ్ములు పాడుసేయుటకె? నీ లక్ష్యమ్ము మా బోటు తెం
చరు చండాల! శనిగ్రహంబ! యిక మా సామర్థ్య ముంజూడుమా!

[7]

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Hyderabad State (in ఇంగ్లీష్). Atlantic Publishers & Distri. 1937.
  2. తూమాటి, దొణప్ప (ఆగస్టు 1969). "ముఖ్య సంస్థానములు". ఆంధ్ర సంస్థానములు సాహిత్య పోషణ (1 ed.). విశాఖపట్టణం: ఆంధ్రవిశ్వవిద్యాలయం. pp. 33–39.
  3. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటి రాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-32
  4. "Rani Bhagya Laxmamma vs Commissioner Of Wealth-Tax, Andhra ... on 22 September, 1965". indiankanoon.org. Retrieved 21 August 2024.
  5. "రాజా సోంభూపాల్ కన్నుమూత". సాక్షి. 19 August 2019. Retrieved 21 August 2024.
  6. "సంస్థానాధీశుడు రాజా సోంభూపాల్ దొర మృతి". ఆంధ్రభూమి. 19 August 2019. Archived from the original on 21 ఆగస్టు 2024. Retrieved 21 August 2024.
  7. తెలుగులో తిట్టుకవిత్వం,రచన:విద్వాన్ రావూరి దొరసామిశర్మ, ఎమెస్కో,మద్రాస్,1968, పుట-198

వెలుపలి లంకెలు

[మార్చు]