అగస్త్యేశ్వర స్వామి దేవాలయం
అగస్త్యేశ్వర స్వామి దేవాలయం | |
---|---|
భౌగోళికాంశాలు: | 18°48′50″N 79°42′59″E / 18.81389°N 79.71639°E |
స్థానం | |
దేశం: | భారతదేశం |
రాష్ట్రం: | తెలంగాణ |
జిల్లా: | మంచిర్యాల జిల్లా |
ప్రదేశం: | చెన్నూర్ |
నిర్మాణశైలి, సంస్కృతి | |
ప్రధానదైవం: | శివుడు |
అగస్త్యేశ్వర స్వామి దేవాలయం తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లా, చెన్నూర్ మండలకేంద్రంలో వెలసిన దేవాలయం.[1] ప్రాచీన అగస్తేశ్వరాలయాలలో ఒకటిగా గుర్తింపుపొందిన ఈ దేవాలయం ఉత్తర వాహిని తీరంలో ఉంది.
స్థల చరిత్ర
[మార్చు]ఇది అతి పురాతన దేవాలయం. అగస్త్య మహాముని ద్వాపరయుగంలో తపస్సు చేయడానికి ఈ ప్రదేశానికి వచ్చి, ఇక్కడి ప్రకృతికి, వాతావరణానికి ముగ్దుడై అతిపెద్ద శివలింగాన్ని ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు. అలా ఈ ఆలయానికి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం అని పేరు వచ్చింది. ఆ తరువాత 1289లో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని పునర్నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయ ప్రాకారం నిర్మాణంలో భాగంగా తవ్వకాలు జరుపుతుండగా ఈ శాసనం బయటపడింది. ఆలయం గర్భగుడిలో అగస్త్య మహాముని ప్రతిష్టించిన శివలింగం ఉంది. ఆలయం ఎదుట నిర్మితమైన మందిరంలో నందీశ్వరుని పెద్ద విగ్రహం, దాని వెనుకాల వినాయకుని విగ్రహం ఉన్నాయి. శివాలయంలోని ముందు మండపంలో ఒకపక్క సూర్య భగవానుని విగ్రహం, మరోపక్క నాగదేవత విగ్రహం, పాలరాతితో కూడిన శివలింగం ఉన్నాయి.
20 ఏళ్ళ తర్వాత అల్లాఉద్దీన్ ఖిల్జీ కాలంలో సేనాని మాలిక్‌కఫూర్ ఈ దేవాలయం పైన దాడిచేసి గోపురాన్ని ధ్వసం చేయగా, శ్రీ కృష్ణదేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చిన సమయంలో ఆలయాన్ని మరోసారి పునర్నిర్మించినట్లు దేవాలయంలోని ఒక శాసనం ప్రకారం తెలుస్తోంది. ఆలయానికి సంబంధించి పలు అంశాలు ఆలయంలోని శాసనంపై చెక్కబడి ఉన్నాయి. ఈ విషయం ఆలయంలో ఉన్న శాసనంపై చెక్కబడి ఉంది. ఈ శాసనంపై మహా మంత్రి తిమ్మరుసు సంతకం చెక్కి ఉంది. తెలుగు, కన్నడ మిశ్రమ భాషలో చెక్కబడి ఉన్న శాసనాన్ని బనారసీ హిందూ యూనివర్సిటీ విద్యార్థులు కొందరు అనువదించారు. దేవాలయం ముందు ప్రతిష్ఠించిన ఈ శాసనం తెలుగు, కన్నడ మిశ్రమ భాషల్లో కనిపిస్తుంది.
అఖండ జ్యోతి
[మార్చు]దేవాలయ గర్భగుడిలో అగస్త్యుడు ప్రతిష్ఠించిన భారీ శివలింగం ఉంది. సుమారు 410 ఏళ్ల నుంచి నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి గర్భగుడిలోని మరో ప్రత్యేకత. అప్పట్లో జక్కెపల్లి సదాశివయ్య అనే బ్రాహ్మణుడు నిత్యం శివలింగానికి పూజలు చేసేవాడు. సదాశివయ్య వెలిగించిన జ్యోతి నాటినుంచి నేటివరకు దేదీప్యమానంగా వెలుగుతోంది. సదాశివయ్య తరువాత ఈ జ్యోతి బాధ్యత, నిత్యపూజలను ఆయన వారసులు చూసుకుంటున్నారు. దీపం ఆరిపోకుండా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం నువ్వుల నూనె పోస్తుంటారు.
స్థల విశిష్టత
[మార్చు]అన్ని నదుల్లా పచ్చిమ దిశ నుంచి తూర్పు దిశకి కాకుండా, ఇక్కడి గోదావరి నది చెన్నూరు మండలంలోని పొక్కూర్ గ్రామం నుంచి కోటపల్లి మండలంలోని పారుపల్లి గుట్టల వరకు 15 కి.మీ.లు గోదావరి నది ఉత్తర దిశగా ప్రవహిస్తోంది. పారుపల్లి గుట్టలపై దిగంబరంగా ఉన్న భైరవుడి విగ్రహ రూపాన్ని చూడలేకే ఇలా ప్రవహించిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. గోదావరి జన్మస్థలం నుంచి సముద్రంలో కలిసే వరకు మరెక్కడా ఇలా లేదు. అందుకే ఈ ప్రాంతంలో పుణ్యస్నానాలకూ, అస్థికలు నిమజ్జనం చేయడానికీ భక్తులు తరలివస్తుంటారు. గోదావరి ప్రత్యేక ప్రవాహం వల్లే ఈ ప్రాంతానికి ఉత్తర వాహిని తీరంగా పిలువబడుతోంది.[2]
ఉత్సవాలు
[మార్చు]- ప్రతి సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి.[3] ఆ సందర్భంగా అఖండజ్యోతికి పూజలు, శివపార్వతుల కళ్యాణం, ఊరేగింపు, జాతరలు జరుగుతాయి.
- కార్తీకమాసంలో వైకుంఠ చతుర్దశి రోజు రాత్రి భక్తులు ఉమ్మెత్త పూలతో శివలింగానికి పూజచేస్తారు.
- శ్రావణమాసంలో నెలరోజుల కఠోర శివదీక్షతో భక్తులు ఈ లింగానికి నిత్యాభిషేకాలు చేస్తారు.
- పుష్కరాల సమయంలో లక్షలాదిమంది భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేస్తారు.
మూలాలు
[మార్చు]- ↑ మన టెంపుల్స్.నెట్. "అగస్త్యేశ్వర స్వామి దేవాలయం". manatemples.net. Archived from the original on 2018-01-20. Retrieved 2018-02-20.
- ↑ Engli, Sudheer (2018-01-12). "గోదావరి నది ఉత్తర దిశకు ప్రవహించే అద్భుతం ఎక్కడో తెలుసా ? - Wirally". www.wirally.com. Archived from the original on 2021-01-22. Retrieved 2021-11-08.
- ↑ "చరిత్రకెక్కిన.. చెన్నూరు - Namasthetelangaana | DailyHunt Lite". Dailyhunt (in ఇంగ్లీష్). Archived from the original on 2021-11-08. Retrieved 2021-11-08.